ఆరోగ్యశ్రీ అధీనంలోకి వెల్‌నెస్‌ సెంటర్లు

Wellness Centers Maintenance Under Aarogyasri - Sakshi

రిలీవ్‌ కావాలంటూ సీఈవో పద్మపై ఉన్నతాధికారుల ఒత్తిడి

ఆందోళనలో ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌ సిబ్బంది, రోగులు

సాక్షి, హైదరాబాద్‌ : ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి వెల్‌నెస్‌ సెంటర్లు వెళ్లనున్నాయా.. అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. శుక్రవారం ఖైరతాబాద్, వరంగల్, సంగారెడ్డి, వనస్థలిపురం వెల్‌నెస్‌ సెంటర్లను ఆరోగ్యశ్రీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇకపై మందులు, చికిత్సలకు సంబంధించి అన్ని రకాల సిఫారసులను తమకే పంపాలని ఆదేశాలు జారీ చేశారు. సీఈవో పద్మను వెంటనే రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీ చేశారు. పద్మ తొలగింపుపై ఉద్యోగులు, పింఛనుదారులు, జర్నలిస్టులు మండిపడ్డారు. తాజా ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు జర్నలిస్టుల సంఘాలు శుక్రవారం కేటీఆర్‌కు విన్నవించగా ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 8,32,085 మంది ఉద్యోగులు, 3,06,125 పింఛనుదారులు, 32,210 జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పటి వరకు 1,19,210 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందారు. ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌లు రాక ముందు ఉద్యోగుల వైద్యబిల్లుల కోసం ప్రభుత్వం ఏటా రూ.700 కోట్లు చెల్లించేది. వెల్‌నెస్‌ సెంటర్లు వచ్చిన తర్వాత రూ.410 కోట్లు ఖర్చు అయింది. అంటే రూ.290 కోట్లు ఆదా అయింది. సీఈవో కల్వకుంట్ల పద్మ రోగుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారు. తాజాగా ప్రభుత్వం ఆమెను తొలగించి, నిమ్స్‌ డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. గురువారం రాత్రి పది గంటలకు రిలీవ్‌ ఆర్డర్‌ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కమీషన్ల కోసమే..
ఉద్యోగులు, పింఛన్‌దారులకు, వారి కుటుంబసభ్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌)ను ప్రవేశపెట్టింది. దేశంలోనే ఉత్తమ వైద్య సేవల కార్యక్రమంగా వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. అన్ని జిల్లాల్లో వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2016 డిసెంబర్‌ 17 నుంచి ఈహెచ్‌ఎస్‌ సేవలు మొదలయ్యాయి. సిద్ధిపేట మినహా మిగిలిన సెంటర్లలో వైద్య సేవలు అందుతున్నాయి. రోజుకు సగటున 2,300 మంది వైద్య సేవలు పొందుతున్నారు. రోజూ రూ.20 వేల విలువైన ఔషధాలను ఉద్యోగులకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సాఫీగా సాగుతున్న ఈహెచ్‌ఎస్‌లో ఇప్పుడు మార్పులు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు వెల్‌నెస్‌ సెంటర్లలో చేస్తున్న వైద్యపరీక్షలు, మందులు ప్రైవేటు సంస్థలకు అప్పగించి వైద్యపరీక్షలు, మందుల కొనుగోలు వంటి అంశాల్లో ఆశించిన మేరకు కమిషన్లు పొందవచ్చని భావించిన అధికారులు, రాత్రికి రాత్రే పది మందిని అపాయింట్‌ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top