విద్యార్థులతో వెబ్‌ కాస్టింగ్‌ 

Webcasting With Students: EC - Sakshi

ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ సేవలు వినియోగించుకోనున్న ఎన్నికల సంఘం  

పోలింగ్‌ కేంద్రాలు:  3,419 అవసరమైన విద్యార్థులు :  3,450 

వైరా: పార్లమెంట్‌ ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘంతో పాటు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల్లో సరళిపై నిఘా పెట్టనుంది. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ద్వారా ఓటింగ్‌ సరళిని పరిశీలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

దీంతో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణకు ఇంజనీరింగ్‌ విద్యార్థుల సేవలను ఉపయోగించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.  

నెట్‌ వర్కే పెద్ద సమస్య 

జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో గత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికలకు కూడా వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు పని చేయాలంటే నెట్‌వర్క్‌ తప్పనిసరి. ప్రతీ కేంద్రంలో నెట్‌వర్క్‌ పనిచేస్తుందా.. లేదా అన్నది సమస్యగా మారింది. ఎన్నికల సంఘం సూచించిన దాని ప్రకారం బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సదుపాయం లేని చోట్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ డేటా కార్డులు, వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సదుపాయం ద్వారా వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించాలని ఆదేశాలున్నాయి.

ఇప్పటికే కొన్ని గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్, ఐడియా, ఎయిర్‌టెల్, ఇతర నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయని గ్రామాలున్నాయి. ఏ పోలింగ్‌ కేంద్రంలో ఏనెట్‌వర్క్‌ పని చేస్తుందో ముందుగా ఆ గ్రామానికి అధికారులు వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏదో ఒక నెట్‌వర్క్‌తో తప్పకుండా పోలింగ్‌ సరళిని పరిశీలించాలి. ఇందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

వెబ్‌ కెమెరాల ఏర్పాటుతో పోలింగ్‌ కేంద్రాల నుంచి కలెక్టరేట్‌కు, కలెక్టరేట్‌ నుంచి హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయానికి, అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి అనుసంధానం చేస్తారు. ఒక కేంద్రంలో పోలింగ్‌ సరళిని ఒకేసారి మూడు చోట్ల ఉన్నతాధికారులు పరిశీలించే వీలవుతుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరపవచ్చని అధికారులు భావిస్తున్నారు.   

ఇంజనీరింగ్, పీజీ విద్యార్థుల సాయం 
గత అసెంబ్లీ ఎన్నికల్లో వీడియో, ఫొటోగ్రఫీతో పోలింగ్‌ ప్రక్రియను రికార్డు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 3,419 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలన్నింటీలో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో సుమారు 3,450 మంది ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులు వెబ్‌కాస్టింగ్‌కు అవసరమవుతుందని అంచనా వేశారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక్కో విద్యార్థిని కేటాయించినా.. రిజర్వుగా మరో 30 మంది విద్యార్థులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top