హెల్మెట్‌ ఉంటేనే..బైక్‌పై రోడ్డెక్కాలి | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ఉంటేనే..బైక్‌పై రోడ్డెక్కాలి

Published Wed, Aug 29 2018 1:46 PM

Wear A Helmet  - Sakshi

‘‘ఖాకీ దుస్తుల్లో పోలీసులు బైకుపై వెళ్లాలంటే.. కచ్చితంగా హెల్మెట్‌ ధరించాల్సిందే. హెల్మెట్‌ లేకుండా రోడ్లపై కనిపించొద్దు’’ అన్న ఉన్నతాధికారుల ఆదేశాలను జిల్లా పోలీసులు పాటిస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా బండిని రోడ్డెక్కించడానికి వెనుకాడుతున్నారు. బైక్‌పై దాదాపుగా తలకు హెల్మెట్‌ పెట్టుకుని వెళ్తున్నారు.సాక్షి, కామారెడ్డి: హెల్మెట్‌ వాడకాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. హెల్మెట్‌ ధరించకుండా బైక్‌లు నడిపేవారికి జరిమానాలు విధిస్తూ, కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

అయితే అందరికీ అవగాహన కల్పించడం, నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించేముందు మనం కూడా నిబంధనలు పాటించాల్సిందే అని, ఖా కీ దుస్తుల్లో బైక్‌పై వెళ్లేవారందరూ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల తో జిల్లాలోని పోలీసులు హెల్మెట్‌ ధరిస్తున్నా రు. జిల్లా పోలీసు కార్యాలయానికిగాని, సబ్‌ డివిజనల్‌ కార్యాలయాలు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లకు, కోర్టు డ్యూటీలకు వెళ్లేవారుకాని, పెట్రోలింగ్‌ డ్యూటీలు చేసేవారు కచ్చితంగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని స్పష్టంగా పేర్కొనడంతో ఇటీవల చాలా మంది పోలీసు సిబ్బంది హెల్మెట్లు కొనుగోలు చేశారు. ప్రతిరోజు ఇంటి నుంచి వెళ్లేటపుడు కచ్చితంగా హెల్మెట్‌తోనే కనిపిస్తున్నారు. 

జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో డీపీవోలో పనిచేసే సిబ్బంది, సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి కార్యాలయం, సర్కిల్‌ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కూడా హెల్మెట్‌లు ధరిస్తున్నారు. ఎక్కడైనా హెల్మెట్‌ లేకుండా ఖాకీ దుస్తుల్లో పోలీసు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో అందరూ హెల్మెట్‌ వాడకానికి అలవాటు పడుతున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హోంగార్డు తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మరణించాడు.

హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాపాయం తప్పేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ హెల్మెట్‌ తప్పనిసరి చేశారు. హెల్మెట్‌ లేకుండా జిల్లా పోలీసు కార్యాలయ గేట్‌లోనికి అనుమతి కూడా ఇవ్వడం లేదు. ‘నో హెల్మెట్‌.. నో ఎంట్రీ’ అన్న బోర్డులు ఏర్పాటు చేశారు. హెల్మెట్‌ లేకుండా వెళ్లినపుడు ఏం జరిగినా అధికారుల నుంచి చివాట్లు తప్పవన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ను వాడుతున్నారు. మహిళా కానిస్టేబుళ్లు కూడా హెల్మెట్‌ ధరిస్తున్నారు. పోలీసులు హెల్మెట్‌ ధరించడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా ఉండవచ్చని, తద్వారా హెల్మెట్‌ ధరించమని ప్రజలకు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులందరూ హెల్మెట్‌ ధరిస్తూ ప్రజలు కూడా హెల్మెట్‌ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement