‘గండ్ర’ సోదరులపై ఆయుధ చట్టం కేసు

Weapon law case on gandra brother's - Sakshi

క్రషర్ల లావాదేవీల్లో గొడవే కారణం

శాయంపేట: కాంగ్రెస్‌ నేత, ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డిలపై మంగళవారం రాత్రి ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది. క్రషర్ల లావాదేవీల గొడవే కారణమని పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ రాజబాబు కథనం ప్రకారం.. మండలంలోని గోవిందాపూర్‌ శివారులో గండ్ర వెంకటరమణారెడ్డి సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డి, ఎర్రబెల్లి రవీందర్‌రావు కలసి శ్రీ వెంకటేశ్వర స్టోన్‌ క్రషర్స్‌ ఏర్పాటు చేశారు. కొన్నాళ్ల తర్వాత కంపెనీ నుంచి గండ్ర భూపాల్‌రెడ్డి వేరుపడి ఆ క్రషర్‌ పక్కనే మరో క్రషర్‌ బాలాజీ రోబో సాండ్‌ను ఏర్పాటు చేశారు.

అయితే.. శ్రీ వెంకటేశ్వర స్టోన్‌ క్రషర్‌కు సంబంధించిన లావాదేవీలు నేటికీ పూర్తి కాలేదు. ఈ క్రమంలో బాలాజీ రోబో సాండ్‌ కంపెనీకి చెందిన సూపర్‌ వైజర్‌ గోవర్దన్‌రెడ్డి సోమవారం రాత్రి క్రషర్‌ సమీపంలో పని చేసుకుంటుండగా అక్కడికి వచ్చిన ఎర్రబెల్లి రవీందర్‌రావు, అతడి అనుచరులు కంపెనీ లావాదేవీలు తేలకుండా ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నావంటూ దాడి చేసి తుపాకీతో బెదిరించారు.

గోవర్దన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రవీందర్‌రావు, అతడి అనుచరులపై ఆయుధ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలాఉండగా..తమ క్రషర్స్‌లో పనిచేస్తుండగా గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు భూపాల్‌రెడ్డి అనుచరులతో కలసి వచ్చి తుపాకీతో బెదిరించారని రవీందర్‌రావు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గండ్ర సోదరులు, వారి అనుచరులపైనా ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజబాబు తెలిపారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top