బిందెనక బిందెపెట్టి!

Water Problem in Greater Hyderabad - Sakshi

గ్రేటర్‌లో తాగునీటికి గండం  

మంచినీటికి మల్లగుల్లాలు  

రోజుల తరబడి ఎదురుచూపులు

ప్రతిచోటా పానీపట్టు యుద్ధాలు  

బస్తీలు, కాలనీలకు అరకొర సరఫరా  

మరికొన్ని ప్రాంతాల్లో లోప్రెజర్‌తో అవస్థలు

ఇంకొన్ని ప్రాంతాల్లో కలుషిత జలాలు   

డిమాండ్‌కు లేని సరఫరా  

నగరంలో మొత్తం నల్లా కనెక్షన్లు: 9.65 లక్షలు  

ప్రతిరోజు నీటి డిమాండ్‌: 530 ఎంజీడీలు  

సరఫరా: 460 ఎంజీడీలు  

నికరంగా కొరత: 70 ఎంజీడీలు   

సాక్షి, సిటీబ్యూరో :నగరం గొంతెండుతోంది. తాగునీటి కోసం తండ్లాడుతోంది. ఎండలు మండిపోతుండడంతో సమస్య తీవ్రరూపందాలుస్తోంది. జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలున్నా...నిర్వహణ లోపాలతోనే ఈ పరిస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే పరిస్థితిలో కొంత మార్పు వచ్చినప్పటికీ... ప్రజాఅవసరాలకు అనుగుణంగా సరఫరా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. రోజు విడిచి రోజు సరఫరా జరగడం లేదనిధ్రువపడింది. ‘సాక్షి’ మంగళవారం నగరంలో పరిశీలించగా ఈ మేరకు వెల్లడైంది. బస్తీలు, కాలనీలకు అరకొర నీటిసరఫరా, కలుషిత జలాల సరఫరా తదితర సమస్యలు కళ్లకు కట్టాయి. వాస్తవానికి ప్రతి వేసవిలో ఉన్నతాధికారులు డివిజన్ల వారీగా పరిస్థితిని సమీక్షించాల్సి ఉన్నప్పటికీ కార్యాలయాలకేపరిమితమయ్యారనే విమర్శలు వినిపించాయి. కిందిస్థాయి సిబ్బందే సరఫరా రోజు, సమయాలు నిర్ణయించే పరిస్థితినెలకొందనే ఫిర్యాదులు వచ్చాయి.

ఒక్కో గుడిసెకుమూడు బిందెలు
బంజారాహిల్స్‌:  జూబ్లీహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని నందగిరిహిల్స్‌ను ఆనుకొని ఉన్న గురుబ్రహ్మనగర్‌ మురికివాడలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. నెల రోజులుగా సరిపోయేన్ని నీళ్లు సరఫరా కాకపోవడంతో స్థానికులు చుట్టుపక్కల అపార్టుమెంట్లకు వెళ్లి బిందెడు నీటిని అడుక్కోవాల్సి వస్తోంది. రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నా పావుగంట కూడా వదలకపోవడంతో ఒక్కో గుడిసెకు మూడు బిందెలు కూడా రావడం లేదు. ఇక్కడ బోర్‌ ఉన్నా భూగర్భజలాలు అడుగంటడంతో ఇబ్బందులు తప్పడం లేదు. బంజారాహిల్స్‌ మాజీ కార్పొరేటర్‌ బి.భారతి నివసించే రోడ్‌ నెం.14లోని లంబాడి బస్తీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. 

మల్కాజిగిరి:  నియోజకవర్గం పరిధిలో దాదాపు అన్ని ప్రాంతాల్లో లో ప్రెషర్‌తో నీరు సరఫరా అవుతోంది. మరికొన్ని ప్రాంతాలలో తాగునీరు కలుషితమవుతోంది. వినాయకనగర్‌ డివిజన్‌ వాజ్‌పేయి నగర్‌లో తాగునీటి సమస్యతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. లో ప్రెషర్‌తో నీరు సరఫరా అవుతోందని ఆరోపిస్తున్నారు. 

యాప్రాల్‌లో...
రాజీవ్‌గృహకల్ప, భరత్‌నగర్‌లో నీటి పైప్‌లైన్‌ అసలే లేదు. ఏళ్ల తరబడి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి. 15, 20 రోజులకు ఒక సారి ట్యాంకర్‌ వస్తోంది. దీంతో 4 నుంచి 5 డ్రమ్ములు ఒక కుటుంబం సరి పెట్టుకుంటున్నామని, ఈ నీటిని స్నానాలు, తాగేందుకు వినియోగించుకోవాల్సి వస్తోందని అంటున్నారు. 

సమయపాలన లేదు
చింతల్‌:  చింతల్‌ వాటర్‌ వర్క్స్‌ డివిజన్‌ నాలుగు సెక్షన్ల పరిధిలో ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన నీటి సరఫరా అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. ఐదు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. గాజులరామారం రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాల్లో దేవేందర్‌నగర్, మల్లారెడ్డినగర్, కైసర్‌నగర్, రోడామేస్త్రీనగర్, మెట్‌కానిగూడ తదితర ప్రాంతాల్లో ఐదురోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. అన్ని సెక్షన్లలో సమయపాలన పాటించడం లేదు. సూరారం తదితర ప్రాంతాల్లో 5 రోజులకు ఒకసారి, కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది.  

మొదటి అరగంట కలుషితం
అంబర్‌పేట:  నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి లో ప్రెషర్‌తో నీటి సరఫరా జరుగుతోంది.  
అంబర్‌పేట డివిజన్‌ న్యూ ప్రేమ్‌నగర్‌లోని 2–3–647/ఎ/300 ప్రాంతంలో 10వ తేదీ నుంచి తాగునీటి సరఫరా లేదు. స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.  
బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లో పోచమ్మబస్తీ సమీపంలో మంగళవారం కలుషిత తాగునీరు సరఫరా అయింది.  
బాగ్‌అంబర్‌పేట మల్లికార్జున్‌ నగర్‌లో ముందస్తు సమాచారం లేకుండా నీటి సరఫరా బంద్‌ చేశారు.  
నల్లకుంట డివిజన్‌లో విజ్ఞాన్‌పురి బస్తీలో.. తిలక్‌నగర్‌బస్తీ, చైతన్యనగర్‌ కాలనీ, భాగ్యనగర్‌లో ట్యాంకర్ల ద్వారానే నీరు సరఫరా అవుతోంది. 

లో ప్రెషర్‌తో సరఫరా 
లో ప్రెషర్‌తో తాగునీరు సరఫరా అవుతోంది. వచ్చే నీళ్లు కూడా గంటకంటే ఎక్కువగా రావడం లేదు. వేసవి కావడంతో ఇంట్లోని బోరు పూర్తిగా ఎండిపోయింది. నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.     – ఎ.సుజాత, మోతిమార్కెట్‌

చాలీచాలని నీళ్లు
అడ్డగుట్ట: ఒక పక్క చాలీచాలని నీళ్లు మరో పక్క కలుషిత నీటి సరఫరా కారణంగా అడ్డగుట్ట డివిజన్‌లోని బి సెక్షన్‌ వాసులు కష్టాలు పడుతున్నారు. అడ్డగుట్ట డివిజన్‌లోని బి సెక్షన్‌ ఇంటి నెం. 10–4–బి/146 సమీప ప్రాంతంలో లో ప్రెషర్‌తో నీళ్లు సరఫరా అవుతున్నాయి. నల్లా నీటిలో మురుగు నీళ్లు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 ఐదు రోజులకోసారి..
కంటోన్మెంట్‌:  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డుకు స్వతహాగా నీటి వనరులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జలమండలి ద్వారా నీటిని కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేస్తోంది. ప్రస్తుతానికి రోజుకు 50 లక్షల గ్యాలన్ల చొప్పున 11 వేర్వేరు రిజర్వాయర్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బోయిన్‌పల్లి పరిధిలోని 1, 6 ఆరు వార్డుల్లో మినహా, మిగతా ఆరు వార్డులో మూడు నుంచి ఐదురోజులకోసారి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. పది రోజుల క్రితం జలమండలి ఎండీ కంటోన్మెంట్‌ బోర్డు కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేసి అదనంగా రోజుకు 13 లక్షల గ్యాలన్ల చొప్పున విడుదల చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు నీటి మోతాదును పెంచితే అన్ని ప్రాంతాల్లో రెండ్రోజులకోసారి నీరు విడుదల చేసే అవకాశముంది. మంగళవారం కంటోన్మెంట్‌లో మెజారిటీ ప్రాంతాల్లో నీటి సరఫరా లేదు. కేవలం 20 శాతం బస్తీలు, కాలనీల్లో మాత్రమే నీటి సరఫరా జరిగింది.

బిందెనక బిందెపెట్టి!
బోయిన్‌పల్లిలో ఐదు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది.  
జూబ్లీహిల్స్‌ డివిజన్‌లోని గురుబ్రహ్మనగర్‌ మురికివాడలో ఒక్కో గుడిసెకు కేవలం 3 బిందెల నీళ్లే వస్తున్నాయి.   
గచ్చిబౌలిలోని బంజారానగర్, దీప్తిశ్రీనగర్‌లలో కేవలం అరగంట పాటే నీటి సరఫరా అవుతోంది. ఇక్కడి పాపిరెడ్డినగర్‌ కాలనీలో దుర్గామాత దేవాలయం సమీపంలో కనెక్షన్లు ఉన్నా నీటి సరఫరా జరగడం లేదు.  
కాప్రా, ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో 23 ఎంజీడీ లు డిమాండ్‌ ఉండగా... 17–18 ఎంజీడీలే సరఫరా అవుతోంది.   
యాప్రాల్‌లోని రాజీవ్‌ గృహకల్ప, భరత్‌నగర్‌లలో నీటి పైప్‌లైన్‌లు అసలే లేవు. ఏళ్ల తరబడి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. 15–20 రోజులకు ఒకసారి ట్యాంకర్‌ వస్తోంది. ఒక్కో కుటుంబం 4–5 డ్రమ్ముల నీటిని పట్టుకొని వాటినే అన్ని అవసరాలకు సరిపెట్టుకుంటోంది.   
అంబర్‌పేట డివిజన్‌ న్యూప్రేమ్‌నగర్‌లోఈ నెల 10 నుంచి నీటి సరఫరా జరగడం లేదు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.  
బాగ్‌అంబర్‌పేట మల్లికార్జుననగర్‌లో ముందస్తు సమాచారం లేకుండా నీటిసరఫరా ఆపేశారు.   

అరగంట మాత్రమే..
ఉప్పల్‌: ఉప్పల్, కాప్రా సర్కిల్, బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల పరిధిలో నీటి కటకట మొదలైంది. కాప్రా సర్కిల్‌ పరిధిలో దాదాపు 50 శాతం గోదావరి జలాలు సరఫరా అవుతుండేవి.. అయితే మంజీరా, సింగూరు ఎండిపోవడం వల్ల గోదావరి జలాలను మళ్లించారు. దీంతో నీళ్లు సరిపోక ఇక్కడి ప్రజలు నీటికి తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం కాప్రా, ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో 23 ఎంజీడీల నీరు డిమాండ్‌ ఉండగా ప్రస్తుతం 17 నుండి 18 ఎంజీడీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. గోదావరి జలాలుమళ్లించడం వల్ల జలమండలి అధికారులు కాప్రా, ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో రోజు విడిచి రోజు గంట సరఫరా చేసే బదులు కొన్ని ప్రాంతాల్లో అరగంట మాత్రమే సరఫరా అవుతోంది. ఉప్పల్‌ న్యూ విజయపురి కాలనీ, శాంతినగర్, విజయపురి కాలనీ, లక్ష్మారెడ్డి కాలనీ, సూర్యనగర్‌కాలనీ, సరస్వతినగర్, ఇందిరానగర్, గాంధీనగర్‌ తదితర ప్రాంతాల్లో కలుషిత జలాల సమస్య తీవ్రంగా ఉంది. ఉప్పల్, కాప్రా సర్కిళ్ల పరిధిలో 63 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఉప్పల్‌ సర్కిల్‌ ప్రాంతంలో 28 వేల నీటి కనెక్షన్లు ఉండగా కాప్రా సర్కిల్‌ పరిధిలో 35 వేల కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో సమయపాలన లేకుండా నీరు వదలడంతో ఎందుకు ఉపయోగం కాకుండా పోతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.  

నిజాం కాలం నాటి పైప్‌లైన్‌
చార్మినార్‌: పాతబస్తీలో నీటి కొరత ఎక్కువగా ఉంది. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిజాం కాలం నాటి తాగునీటి పైపులైన్‌ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రధాన రోడ్లలో ప్రాజెక్టు పనులు జరిగినా అంతర్గత బస్తీల్లో ఇంకా పాత పైపులైన్‌ ద్వారానే నీటి సరఫరా అవుతోంది. కుళాయిల్లో వచ్చే కలుషిత నీటి సరఫరాతో స్థానికులు అనారోగ్యాలకు గురవుతున్నారు. దాంతో 20 లీటర్ల నీటి క్యాన్లను బహిరంగ మార్కెట్‌లో ఖరీదు చేస్తున్నారు. నీటి సరఫరా ప్రారంభమైన చాలా సేపటి వరకు కలుషితంగా వస్తుండటంతో పాతబస్తీ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.  

చుక్క చుక్కకూ నిరీక్షణే...
ఎల్‌బీనగర్‌: ఎల్‌బీనగర్‌జోన్‌ పరిధిలో నీటి సరఫరా అస్తవ్యస్థంగా ఉంది. రోజు విడిచి రోజు నీరు సరఫరా అవుతున్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజు వారిగా ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ పరిధిలో 32ఎంజీడీ నీరు సరఫరా అవుతోంది. లో ప్రెషర్‌తో కారణంగా మహిళలు వాగ్వాదానికి దిగుతున్నారు. చుక్క నీటికి నిరీక్షించాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
లింగోజిగూడ డివిజన్‌లోని మజీద్‌గల్లిలో మురుగు నీరు సరఫరా అవుతోంది.  
హయత్‌నగర్‌లో కలుషిత నీరు సరఫరా అవుతోంది.

సమయపాలన లేకుండా..
కూకట్‌పల్లి (జోన్‌బృందం):  కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో కొన్ని బస్తీల్లో సమయపాలన లేకుండా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిద్రలేని రాత్రులు గడుపుతూ నీటి కోసం నిరీక్షిస్తున్నారు. మరి కొన్ని బస్తీల్లో పూర్తిగా నీటి సరఫరా లేకుండా పోయింది. రిజర్వాయర్‌ దగ్గర ఉన్న ప్రాంతాల్లో కూడా నీటి సరఫరాకు కనీసం పైపులైన్లు లేకపోవటం గమనార్హం.  
ఆల్విన్‌కాలనీ డివిజన్‌ ఎల్లమ్మబండ, ఎన్‌టీఆర్‌నగర్‌లలో నీటి ట్యాంకు ఉపయోగంలో లేదు.
జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం గృహ సముదాయాల్లో కనీసం నీటి పైపులైన్లు కూడా వేయడం మరిచారు. ప్రైవేట్‌ ట్యాంకర్లను ఆశ్రయించి నీటిని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి.  
వివేకానందనగర్‌ డివిజన్‌ రిక్షాపుల్లర్స్‌ కాలనీలో మురుగు చేరి కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి.  
బాలానగర్‌ డివిజన్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో నాలుగు నెలల నుంచి మురుగు నీరు సరఫరా అవుతోంది.  
మూసాపేట డివిజన్‌లో అర్ధరాత్రి వేళలో సరఫరా అవుతోంది.  

ఏళ్లుగా అవే అవస్థలు
మేడ్చల్‌: మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని కిందిబస్తీ, ఆర్టీసీ కాలనీ, వినాయక్‌నగర్, ఎన్‌జీవోస్‌ కాలనీల్లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  
శామీర్‌పేట్‌ మండలంలోని ఉద్దెమర్రి, కేశవరం, లక్ష్మాపూర్, పొన్నాల్, అద్రాస్‌పల్లి, శామీర్‌పేట్‌ గ్రామాల్లో నీటి సరఫరా సక్రమంగా లేదు. జవహర్‌నగర్‌లోని శాంతినగర్, అంబేడ్కర్‌నగర్, గబ్బిలాలపేట్, బీజేఆర్‌నగర్, మోహన్‌రావు నగర్, వికలాంగుల కాలనీ, మోహన్‌రావు నగర్‌ తదితర కాలనీల్లో నీటి సరఫరా సక్రమంగా లేదు.  
కీసర మండలంలోని నాగారం, దమ్మాయిగూడ గ్రామాల్లో నీటి కొరత నెలకొంది. ఆయా కాలనీవాసులు ప్రైవేటు ట్యాంకర్ల వద్ద నీటిని కొనుగోలు చేస్తున్నారు.  
ఘట్‌కేసర్‌ పట్టణంలోని సాయినగర్‌ కాలనీలో నీటి సరఫరా కావడం లేదు. మెయిన్‌ రోడ్డులో ఉన్న హోటళ్లకు ఎక్కువ నీరు సరఫరా అవుతోంది. నీటి సరఫరా సమయంలో కొన్ని ఇళ్ల యజమానులు మోటార్లు బిగించడంతో చివరన ఉన్న ఇళ్ల వారికి నీరు సరఫరా కావడం లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top