నీళ్ల నిలువను, విలువను తెలిపే థీమ్‌పార్క్‌ 

Water Harvesting Theme Park In Hyderabad - Sakshi

నేలతల్లి నుదుట నీటిబొట్టు

భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో వాననీటి సంరక్షణకు ప్రాధాన్యం

  నొక్కి చెబుతున్న ప్రముఖులు 

నీటి సంరక్షణ విధానాలు తెలుసుకునేందుకు నగరంలోనే థీమ్‌ పార్కు  

పదివేల మందికిపైగా సందర్శన

బొట్టు.. బొట్టును ఒడిసిపడితేనే క్షేమం..  లేకుంటే క్షామం.. ఈ మాట అక్షరసత్యమవుతోంది.. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాన నీటి సంరక్షణ తాలూకు ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాల్సిన తరుణమిది.. అందుకే తాజాగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు కూడా దీనిపై ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు. వాన నీటి సంరక్షణపై ఆసక్తి కలిగినవారు తప్పనిసరిగా రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ థీమ్‌ పార్కును సందర్శించాలంటూ దానికి సంబంధించిన పలు చిత్రాలను షేర్‌ చేశారు.. ఇంతకీ ఎక్కడుందీ థీమ్‌ పార్క్‌.. ఏమిటి ఉపయోగం అన్న వివరాలను ఓసారి చూసేద్దామా..

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌నం.51లో జలమండలి ఆధ్వర్యంలో రూ.3 కోట్ల వ్యయంతో ఈ థీమ్‌పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వర్షపునీటిని ఒడిసిపట్టడానికి వీలుగా 42 రకాల వినూత్న విధానాలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది అక్టోబరులో ఈ పార్క్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు పదివేలమందికి పైగా  సందర్శించారు. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఇల్లు, కార్యాలయం, పాఠశాల, అపార్టుమెంటు ఇలా ఎక్కడైనా నేలపై కురిసే ప్రతీ వర్షపునీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భంలోకి చేర్చేందుకు వీలుగా విభిన్నరకాల ఇంకుడు గుంతల వెరైటీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీ ఆసక్తి.. చేసే వ్యయం ఆధారంగా ఒక మోడల్‌ను ఎన్నుకొని మీ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను ఈ థీమ్‌పార్క్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. అంతేనా.. అడవుల ప్రాముఖ్యాన్ని వివరించే ‘మాట్లాడే చెట్టు’.. వర్షపు నీటి సంరక్షణపై వీడియో గేమ్స్‌ ఇలా ఎన్నో ఉన్నాయి.. పార్కు వేళలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకూ.. ప్రవేశం ఉచితం.. ఎక్కువ మంది బృందంగా వెళ్లాలనుకుంటే ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.  జలమండలి అధికారిక వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.హైదరాబాద్‌వాటర్‌.జీఓవీ.ఐఎన్‌ను సంప్రదించి అందులో థీమ్‌పార్క్‌ రిజిస్ట్రేషన్‌ యువర్‌స్లాట్‌ అన్న లింక్‌కు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాలి లేదా జలమండలి ప్రత్యేకాధికారి సత్యనారాయణను 9989985102 నంబరులో సంప్రదించవచ్చు. మరింకేంటి ఆలస్యం.. నీటి బొట్టును నేల తల్లికి అందించే ఈ మహాయజ్ఞంలో మనమూ భాగస్వాములమవుదాం. చల్‌ చలోచలో.. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top