రైతుపై వీఆర్వో దాడి

VRO attack on farmer khammam - Sakshi

సాక్షి, తొర్రూరు(పాలకుర్తి): పాస్‌పుస్తకం కోసం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన ఓ రైతుపై వీఆర్వో దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మహబూ బాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం పత్తేపురం గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్, రైతు లక్ష్మారెడ్డి, అదే గ్రామానికి చెందిన అతడి మేనత్త తలాసాలి పుషమ్మ తమకు ఉన్న వ్యవసాయ భూమిని రికార్డుల్లో ఎక్కించి పాస్‌ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ నాలుగేళ్లుగా వీఆర్వో ఉప్పలయ్య చుట్టూ తిరుగుతున్నారు. ఇందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పగా, వారు కొద్ది నెలల క్రితం రూ.10వేలు ఇచ్చారు.

అయినా భూమిని రికార్డుల్లోకి ఎక్కించడంలేదు. పాస్‌పుస్తకం జారీ చేయ డం లేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మారెడ్డి వీఆర్వోను తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ప్రశ్నించాడు. మరో రూ.10వేలు ఇస్తేనే పాస్‌పుస్తకాలు జారీ చేస్తానని నిర్లక్ష్యంగా చెప్పి వెళ్లిపోతున్నాడు. తాను అడుగుతుంటే సరైన సమాధానం చెప్పకుండా వెళ్తున్నావేమిటని వీఆర్వోను లక్ష్మారెడ్డి నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన వీఆర్వో లక్ష్మారెడ్డితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ పెరిగి వీఆర్వో ఉప్పలయ్య లక్ష్మారెడ్డిపై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న స్థానికులు, రెవెన్యూ సిబ్బంది అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్‌ సిబ్బంది చేరుకుని శాంతింపజేశారు.

పురుగుల మందు డబ్బాతో రైతు నిరసన

భూపాలపల్లి: వీఆర్వో తనకు అన్యాయం చేశాడని ఆరోపిస్తూ ఓ రైతు ఆర్డీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం క్రిమిసంహారక మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరంపల్లి గ్రామానికి చెందిన పోత శ్రావణ్‌కు ధన్వాడ శివారులోని సర్వే నంబర్‌ 236/ఏలో 18 గుంటలు, సర్వే నంబర్‌ 235లో 2.11 ఎకరాల భూమి, సర్వే నంబర్‌ 326లో 2.22 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో 60 ఏళ్లుగా తాత, తండ్రి, ప్రస్తుతం తాను వ్యవసాయం చేశామని తెలిపాడు.

కాగా వీఆర్వో రాజయ్య తనకు తెలియకుండా ఆ భూమిని వేరే ముగ్గురి పేర పట్టా చేశాడని ఆరోపించాడు. ఈ విషయమై వీఆర్వోను అడగ్గా సమస్యను పరిష్కరించకపోగా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని తెలిపాడు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి తన భూమిని తనపై పట్టా చేయాలని, లేని పక్షంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని పట్టుబట్టాడు. ఆర్డీఓ కార్యాలయంలోని సిబ్బంది వచ్చి ఆర్డీఓ వచ్చాక సమస్యను విన్నవించాలని చెప్పి, క్రిమిసంహార మందు డబ్బాను లాక్కున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top