మున్సిపల్‌ ఎన్నికల ముసాయిదా విడుదల

Voter List Releases For Muncipal Elections In Adilabad - Sakshi

కులగణన, ఓటర్ల జాబితా వెల్లడించిన అధికారులు

ఇంటి నంబర్ల ఆధారంగా విభజన

నేడు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం

సాక్షి, ఆదిలాబాద్‌: కుల గణన, ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్‌ అధికారులు బుధవారం వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో పూర్తి వివరాలు సిద్ధం చేస్తున్నారు. పుర ఎన్నికలకు సంబంధించి అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్లను గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో వాటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.

13న మొత్తం అభ్యంతరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 14న తుది జాబితా ప్రకటిస్తారు. అనంతరం మున్సిపల్‌ అధికారులు వార్డుల రిజర్వేషన్లను ఈనెల 15న లేదా 16న ప్రకటించనున్నారు. మున్సిపల్‌ చైర్మన్, వైస్‌చైర్మన్ల రిజర్వేషన్లను ప్రభుత్వమే ప్రకటించనుంది. పెరగనున్న పోలింగ్‌ కేంద్రాలు.. గతంలో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 100 పోలింగ్‌  కేంద్రాలు ఉండగా, విలీనమైన గ్రామాల్లో 38 పోలింగ్‌ కేంద్రాలతో ఆ సంఖ్య 138కి చేరింది. ప్రస్తుతం ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 800 చొప్పున ఓటర్లతో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే దీంతో దాదాపు 152 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

మూడు వార్డులకు ఒక ఎన్నికల అధికారి
మున్సిపల్‌ అధికారులు వార్డుల వారీగా ఎన్నికల అధికారుల నియామకాన్ని పూర్తి చేశారు. మూడు వార్డులకు కలిపి ఒక ఎన్నికల అధికారి, ఒక సహాయ ఎన్నికల అధికారిని నియమించనున్నారు. గెజిటెడ్‌ హోదా కలిగిన వారిని ఎన్నికల అధికారులుగా నియమించగా, నాన్‌గెజిటెడ్‌ వారికి సహాయకులుగా బాధ్యతలు అప్పగించారు. వార్డుల వారీగా నామపత్రాల స్వీకరణ, పరిశీలన, తదితర ప్రక్రియను సంబంధిత అధికారులే పర్యవేక్షించనున్నారు. బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా ఆ పెట్టెలను జిల్లా నుంచే తీసుకోనున్నారు. బ్యాలెట్‌ పత్రాలు మాత్రం ఇతర చోట్ల ముద్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

నోడల్‌ అధికారుల నియామకం 
మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్‌ అధికారులతోపాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని నియమించనున్నారు. వివిధ శాఖలకు చెందిన 10 మంది ఉన్నతాధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత  అప్పగించారు. పోలింగ్‌ నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది నియామకం, బ్యాలెట్‌ పెట్టెల సేకరణ, పర్యవేక్షణ, రవాణా సౌకర్యం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఎన్నికల సామగ్రి తయారీ, నిర్వహణ, బ్యాలెట్‌పత్రాల తయారీ, ఎన్నికల ఖర్చుల వివరాలు పర్యవేక్షించడం, ఎన్నికల కసరత్తు పరిశీలన, మీడియా సమాచారం, సమన్వయ, సహాయ కేంద్రం నిర్వహణ, పర్యవేక్షణ తదితర పనులు నిర్వహించే బాధ్యతలను నోడల్‌ అధికారులకు అప్పగించారు.

ఓటరు నమోదుకు అవకాశం..
మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యేంత వరకు 18 ఏళ్ల వయస్సు గల వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితాలో మున్సిపాలిటీలో 1,21,977 మంది ఓటర్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు జరగనుండడంతో కొత్తగా కొంతమంది దరఖాస్తు చేసుకుంటున్నారని, మరికొంత మంది కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, దీంతో ఓటర్ల సంఖ్య మరింతగా పెరగనున్నట్లు పేర్కొన్నారు.

రాజకీయ పార్టీల నేతలతో సమావేశం
మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో గురువారం రాజకీయ పార్టీల నేతలతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించనున్నారు. ముసాయిదాకు సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించనున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top