కరోనా : కలకలం రేపిన వియత్నాం పర్యటకులు

Vietnam Citizens Send To Gandhi Hospital From Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : నల్గొండలో వియత్నాం బృందం పర్యటన కలకలం రేపింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో విదేశీయులు ఎక్కడ కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసులకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లగొండ పర్యటనకు వచ్చిన 12 మంది వియత్నాం పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైల్ ఖానా సమీపంలో ప్రార్ధన మందిరంలో గురువారం అర్ధరాత్రి 12 మంది పెద్దలు, ఇద్దరు చిన్నారుల గల వియత్నాం బృందం సంచరించటాన్ని గుర్తించారు. ఆ తరువాత వైద్యులు, అధికారుల సూచనలతో వారందరినీ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. (ఓ కరోనా.. ఇది నీకు వినిపిస్తోందా?)

కాగా వియత్నాంకు చెందిన వీరంతా భారత్‌ పర్యటనలో భాగంగా మార్చి 4న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడి నుంచి  ఈనెల 9న నాంపల్లి స్టేషన్‌కు చేరుకున్నారు. ఇద్దరు గైడ్లతో కలిపి మొత్తం 14 మంది అదే రోజున నల్లగొండలో దిగారు. అయితే స్థానికుల సమాచారం  పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు నల్లగొండకు వచ్చి 14 రోజులు అవుతోన్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని.. అయినా ముందు జాగ్రత్త కోసం గాంధీకి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కరీంనగర్‌లో పర్యటించిన ఇండోనేషియా బృందంలోని ఎనిమిది మందికి కరోనా పాజిటీవ్‌ అని తేలడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. దీంతో విదేశీయులు ఎక్కడా పర్యటించకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top