
అప్పుడు గుండె ఆగినంత పనైంది..
ఆదివారం ఉదయం 6.40 గంటలు. అమెరికాలో చదువుతున్న కొడుకు యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు వీడియో కాల్ చేశారు.
- తల్లి కళ్ల ముందే కొడుకు తలపై తుపాకీ పెట్టిన ఆగంతకుడు
- ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి.. అంతలోనే వీడియా కాల్ కట్
- అమెరికా స్టోర్ దోపిడీ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు
శ్రీరాంపూర్(మంచిర్యాల): ఆదివారం ఉదయం 6.40 గంటలు. అమెరికాలో చదువుతున్న కొడుకు యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు వీడియో కాల్ చేశారు. ముందు తండ్రి మాట్లాడారు. అనంతరం కొడుకుతో మాట్లాడమని భార్యకు ఫోన్ ఇచ్చి అతను డ్యూటీకి వెళ్లి పోయాడు. తల్లి కొడుకుతో వీడియో కాల్ కొనసాగిస్తోంది. ఆ సమయంలో కొడుకు ఓ స్టోర్స్ కౌంటర్ వద్ద ఉండి మాట్లాడుతున్నాడు. కాసేపటికి ఆ తల్లికి గుండె ఆగిపోయేంత పనైంది.
ఓ ఆగంతకుడు వచ్చి కొడుకు తలపై రివాల్వర్ పెట్టాడు... చంపుతానని బెదిరిస్తున్నాడు... కొడుకు వణికిపోతున్నాడు... ఏం జరుగుందో అర్థ«ంకాని పరిస్థితి... కొడుకును ఎవరతను అని అడిగే లోపే వీడియో కాల్ కట్ అయ్యింది. శనివారం రాత్రి 8.40 గంటల (భారత కాలమాçనం ప్రకారం ఆదివారం ఉదయం 6గంటలు) ప్రాంతంలో అమెరికాలో ఓ స్టోర్స్‌లో ఉన్న తెలుగు విద్యార్థిని ఓ ఆగంతకుడు ముసుగు ధరించి వచ్చి తుపాకీతో బెదిరించి డబ్బులు దోచుకున్నాడు. బాధితుడు సాయివరుణ్ తల్లిదండ్రులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కృష్ణకాలనీకి చెందినవారు.
వారు అక్కడ జరిగిన ఘటనను కొడుకు ద్వారా తెలుసుకున్న విషయాలను సోమవారం వెల్లడించారు. సాయివరుణ్ తండ్రి సామినేని భాస్కర్‌రావు శ్రీరాంపూర్ ఓసీపీలో టెక్నికల్ సూపర్‌వైజర్. కుమారులిద్దరూ అమెరికాలోని మిస్సిటీలో ఉంటున్నారు. పెద్దకొడుకు సాయికిరణ్ ఎంఎస్ పూర్తయి ఉద్యోగ కోసం(ఓటీపీ) ఎదురుచూస్తున్నాడు. చిన్న కొడుకు సాయివరుణ్ ఎంఎస్ చదువుతున్నాడు. ఇతను ఉండే ప్రాంతంలోనే స్నేహితుడికి చెందిన ఓ స్టోర్స్ ఉంటుంది. తరచూ సదరు స్టోర్‌కు వెళ్తుంటాడు. అమెరికా కాలమాన ప్రకారం శనివారం రాత్రి కూడా స్టోర్స్‌కు వెళ్లాడు. స్నేహితుడు బయటికి వెళ్లివస్తానని.. స్టోర్స్ చూసుకోమని చెప్పి కౌంటర్ అప్పగించి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న కంప్యూటర్ నుంచి తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు.
ఇంతలో ముసుగు ధరించి వచ్చిన ఆగంతకుడు తుపాకీ తీసి సాయివరుణ్‌ను బెదిరించాడని తల్లిదండ్రులు తెలిపారు. ‘‘చంపేస్తా.. కౌంటర్ ఓపెన్ చేయ్’’అంటూ బెదిరించడంతో చేసేది లేక కౌంటర్ తెరవగా.. దాంట్లో ఉన్న డబ్బును దోచుకున్నాడు. ఆ సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావని ఆగంతకుడు.. అడగటంతో తాను ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నానని, తాను విద్యార్థిననీ , తనను ఏమీ చేయవద్దని వేడుకున్నాడనీ అయినా నిందితుడు... డబ్బులు తీసుకొంటూనే ‘‘క్యాష్ తీసుకొని చంపేస్తా’’అని బెదిరించాడని తెలిపారు. ఇంతలో స్టోర్స్ ముందున్న పెట్రోల్‌బంక్ వద్దకు ఓ కారు రావడంతో శబ్దం విని వెంటనే ఆగంతకుడు పారిపోవడంతో ప్రాణాపాయం తప్పిందని బాధితుని తల్లిదండ్రులు అక్కడి ఘటనను వివరించి చెప్పారు.
దేవుడి దయవల్లే ఏమీ కాలేదు
జయలక్ష్మి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో తుపాకీతో ఆగంతకుడు వచ్చి బెదిరించడం, అప్పుడే కాల్ కట్ కావడంతో వెంటనే జయలక్ష్మి భర్త భాస్కర్‌రావుకు విషయం చెప్పింది. అతను పెద్దకొడుకు సాయికిరణ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పెద్దకొడుకు ‘‘మీరు మళ్లీ తమ్మునికి ఫోన్ చేయకండి.. ఫోన్‌చేస్తే ఆగంతకుడు విసుగు చెంది ఏమైనా చేస్తాడు... నేను వెంటనే వెళ్తా’’నని చెప్పి 16 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నట్లు వారు తెలిపారు. అప్పటికే ఆగంతకుడు పారిపోగా.. తమ్ముడికి ఏమీ జరుగకపోవడంతో వెంటనే తల్లిదం డ్రులకు విషయం చెప్పాడు. దేవుని దయవల్లే తమ కొడుక్కు ఏమీ కాలేదని వారు పేర్కొన్నారు.