యాదాద్రిపై నీ బొమ్మలెందుకు?

VHP Concerned Over KCR Images Carving in Yadadri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : యాదాద్రి ఆలయ ప్రాకారలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ బొమ్మ చెక్కడంపై వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావి నూతల శశిధర్‌ మండిపడ్డారు. ఈ చర్య హిందువులందరినీ బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌, మహాత్మ గాంధీ, ఇందిరా, రాజీవ్‌ గాంధీల బొమ్మలతో పాటు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చారిత్రక గుర్తులు ప్రతిబింబించేలా ఆలయ గోపుర, ప్రాకారాలపై శిల్పులు బొమ్మలు చెక్కుతున్నట్టు వార్తలు వచ్చాయి.

దీని వల్ల ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బ తింటుందని ఆగమ శాస్త్ర పండితులు భావిస్తోన్న నేపథ్యంలో ఆయనపై విధంగా స్పందించారు. చారిత్రాత్మక ఘటనలను చెక్కడం ద్వారా యాదాద్రి పవిత్రతను కాపాడాలి గానీ, ధార్మిక ప్రదేశాల్లో రాజకీయ పార్టీల చిహ్నాలు ఎందుకని ప్రశ్నించారు. ఇది కేసీఆర్‌ అహంకారానికి, పతనానికి నిదర్శనమన్నారు. ఇలాంటి నీచ పనులు మానుకోకుంటే, పుణ్య క్షేత్రాలను కాపాడేందుకు ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

బీజేపీ నాయకుల ధర్నా
పవిత్ర యాదాద్రి ఆలయంలో కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు తొలిగించాలంటూ బీజేపీ నాయకులు శుక్రవారం ధర్నాకు దిగారు. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగమ శాస్త్రాలను గాల్లో కలిపేసి కేసీఆర్‌ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడం దుర్మార్గమన్నారు. ఆలయ పవిత్రతను కాపాడాలని, తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top