ఆక్వాలో నంబర్‌ వన్‌కు చేరాలి

Venkaiah naidu says Aqua should be number one - Sakshi

ఆక్వా ఆక్వేరియా ఇండియా ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్‌: సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే భారత్‌ రెండోస్థానంలో ఉందని, ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా నంబర్‌ వన్‌కు చేరాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.  దేశంలో ఉన్న జల వనరులను 40 శాతమే ఆక్వాకల్చర్‌కు వినియోగించుకుంటున్నామని అన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్‌లో ఏర్పాటైన ఆక్వాఆక్వేరియా ఇండియా– 2019 ప్రదర్శనను వెంకయ్యనాయుడు ప్రారంభించారు.  ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపీఈడీఏ లాంటి సంస్థలు, ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు కృషి చేయాలని సూచించారు.

మెరుగైన ఫిషరీస్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతులను రూపొందించుకుని, ఖచ్చితమైన అమలు కోసం కృషి జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని, వారికి లాభాల్లో తగిన వాటా ఉం డేలా విధానాల రూపకల్పన జరగాలన్నారు. దేశంలో ఆహార సమృద్ధి ఉన్నప్పటికీ, ప్రొటీన్‌ సహిత పోషకాహారంలో సముద్ర ఉత్పత్తులు, సంప్రదాయ ఆహార పద్ధతులే సరైనవని అభిప్రా యపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ‘ఫిట్‌ ఇండియా’ కార్యక్రమం ఉద్యమంగా మారా లని పిలుపునిచ్చారు. ఫిట్‌నెస్, యోగాలపై దృష్టి పెట్టాలని, ఆహార అలవాట్లను పునఃసమీక్షించుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్థక రంగ అభివృద్ధికి చేపట్టిన చర్యలు అభినందనీయమని ప్రశంసించారు. 

60 శాతం విదేశీ మారక ద్రవ్యం ఏపీ నుంచే... 
సువిశాల సముద్రతీరమున్న ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఆక్వారంగంలో 60 శాతం విదేశీ మారకం వస్తోందని ఆ రాష్ట్ర పశుసంవర్థక మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. ఏపీలో 14.5 లక్షల మంది ఈ రంగంతో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో డీజిల్‌ రాయితీ పెంపు తోపాటు నాణ్యమైన సీడ్‌ను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెరైన్‌ రంగంలో మార్పులు చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని మత్స్యకారులకు అందుబాటులోకి తేవాలన్నారు.

అభివృద్ధికి పలు చర్యలు... 
తెలంగాణలో మత్స్యరంగ అభివృద్ధికి పలు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. ముఖ్యమం త్రి కేసీఆర్‌ మత్స్యరంగ అభివృద్ధికి అధిక ప్రాధా న్యం కల్పించినట్లు తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ ఫిషరీస్‌ అభివృద్ధి పథకం కింద మత్స్యకారులకు 70–90 శాతం రాయితీతో పరికరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు ఎంపీఈడీఏ అధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆక్వారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగం అమలు చేస్తున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆక్వా రంగంలో విశేష కృషి చేసిన 10 మంది రైతులకు ఉపరాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, పశుసంవర్థక కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ సువర్ణ, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top