వియత్నాం, థాయ్‌లాండ్ నుంచి మన దేశంలోకి దిగుమతికి సన్నాహాలు
తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తి చేసే సీడ్స్‌లోఆర్‌ఎంఎస్, ఈఎంఎస్ వ్యాధులు
అవి సోకితే 20–30 రోజుల్లోనే రొయ్యలు చనిపోయే ప్రమాదం
2022లోనూ ఆ దేశాల నుంచి బ్రూడర్స్ దిగుమతికి సీడ్ కంపెనీల యత్నం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒత్తిడితో నాడు దిగుమతికి అంగీకరించని కేంద్రం
ఇప్పుడు మళ్లీ బ్రూడర్స్ దిగుమతికి కసరత్తు
నేడు ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖాధికారులతో బ్రూడర్స్ దిగుమతిదారుల సమావేశం
అడ్డుకోకుంటే ఏపీ రైతులకు అపార నష్టం వాటిల్లుతుందని ఆందోళన
తక్షణమే చంద్రబాబు సర్కారు స్పందించాలని ఆక్వా రైతుల డిమాండ్
సాక్షి, అమరావతి: మన ఆక్వా రంగానికి మరో ముప్పు ముంచుకొస్తోంది! ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లి రొయ్యల (బ్రూడర్స్) దిగుమతికి చాపకింద నీరులా జరుగుతున్న సన్నాహాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ ప్రతీకార పన్నుల విధింపుతో ఆక్వా రైతులు విలవిలలాడుతుండగా ఇక నిరంతర మరణాలకు దారితీసే వైరస్‌లు, తెగుళ్లకు కేంద్రమైన ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లి రొయ్యల దిగుమతికి అనుమతినిస్తే ఆక్వా రంగం అతలాకుతలం అవుతుందని హెచ్చరిస్తున్నారు. దీనిపై గురువారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కారు తక్షణమే స్పందించి బ్రూడర్స్ దిగుమతిని అడ్డుకోవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఏటా రూ.1,800 కోట్లకుపైగా వ్యాపారం
మత్స్య ఉత్పత్తుల సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో నంబర్ వన్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం గత రెండేళ్లుగా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. జాతీయ స్థాయిలో 8.64 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుండగా, అందులో ఏపీలో 6.50 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం, చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటా కలిగిన ఏపీలో దాదాపు 26 లక్షల మందికి పైగా ఆక్వా రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 585 హేచరీలుంటే 423 ఒక్క ఏపీలోనే ఉన్నాయి. ఏటా 2 లక్షల తల్లి రొయ్యలను (ఆడ, మగ కలిపి) హవాయ్ నుంచి మన దేశీయ కంపెనీలు దిగుమతి చేసుకుంటుండగా వీటిలో 70 శాతం మన రాష్ట్ర పరిధిలోని హేచరీలే దిగుమతి చేసుకుంటున్నాయి.
ఒక్కొక్క తల్లి రొయ్య ఖరీదు రూ.9 వేలు ఉంటుంది. తల్లి రొయ్యల దిగుమతులపై ఏటా రూ.1,800 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వెనామీ తల్లి రొయ్య ద్వారా 3–5 లక్షల సీడ్ ఉత్పత్తి చేస్తుండగా టైగర్ తల్లి రొయ్య నుంచి 4–8 లక్షల సీడ్ ఉత్పత్తి జరుగుతుంది. సీడ్ కోసమే ఎకరాకు రూ.ఐదారు లక్షలకు పైగా రైతులు ఖర్చు చేస్తుంటారు.
దిగజారిన ఎగుమతులు, సాగు
ఇప్పటికే వైట్ స్పాట్, వెబ్రియా లాంటి వైరస్‌లకు తోడు ట్రంప్ ప్రతీకార దిగుమతి సుంకం పెంపు (50శాతం) నేపథ్యంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ట్రంప్ సుంకాల ప్రభావంతో ఏటా రూ.12 వేల కోట్లకుపైగా భారం పడుతోంది.
కంపెనీల మాయాజాలంతో కౌంట్ ధరలు పడిపోయి ఎగుమతులు దిగజారిపోయాయి. వైరస్‌ల ప్రభావంతో దిగుబడులు, సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు గోదావరి, కృష్ణా జిల్లాల్లో మెజార్టీ రైతులు ఆక్వా సాగు సమ్మె దిశగా అడుగులు వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లి రొయ్యల దిగుమతి వార్త ఆక్వా పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
నేడు ఢిల్లీలో కీలక సమావేశం
తాజాగా మరోసారి ఆయా దేశాల నుంచి తల్లి రొయ్యలను దిగుమతి చేసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన ఈ అంశంపై అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. వీటి దిగుమతుల ద్వారా భారీగా విదేశీ మారక ద్రవ్యం రానుండడంతో కేంద్రం మొగ్గు చూపుతోంది. తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఉపద్రవాన్ని అడ్డుకోవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
2022లో అడ్డుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లి రొయ్యల దిగుమతులను 2013లోనే ఆక్వా సాగు చేసే మెజార్టీ దేశాలు నిషేధించాయి. అక్కడి తల్లి రొయ్యల ద్వారా ఉత్పత్తి చేసే సీడ్‌లో రన్నింగ్ మారా్టలిటీ సిండ్రోమ్ (ఆర్‌ఎంఎస్), ఎర్లీ మారా్టలిటీ సిండ్రోమ్ (ఈఎంఎస్) లాంటి వైరస్‌లే కారణం. ఈ వైరస్‌ల నియంత్రణపై మందుల ప్రభావం పెద్దగా ఉండదు. పెద్దగా వ్యాధి నిరోధక శక్తి లేని ఈ సీడ్ వేసిన 20–30 రోజుల్లోనే చనిపోతాయి.
కనీసం 20–30 శాతం సీడ్ కూడా బతికే పరిస్థితి ఉండదు. పంట కాలం ముగిసే సరికి భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తాయి. కనీస దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. పెరుగుదల పూర్తిగా మందగిస్తుంది. చైనా, మెక్సికో, మలేషియా లాంటి దేశాల్లో ఈ వైరస్‌ల వల్ల ఆక్వా పరిశ్రమ కుదేలైంది.
2022లో ఈ దేశాల నుంచి తల్లిరొయ్యల దిగుమతికి జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరగగా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అడ్డుకుని కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచి్చంది. పలుమార్లు లేఖలు రాయడంతోపాటు ప్రత్యేక బృందాలను పంపి వీటి దిగుమతి వల్ల కలిగే దు్రష్పరిణామాలను వివరించడంతో కేంద్రం వెనుకడుగు వేసింది.
అడ్డుకోకుంటే మనుగడ ఉండదు
ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లిరొయ్యల దిగుమతులను అడ్డుకోకపోతే దేశీయంగా ఆక్వా పరిశ్రమకు మనుగడ ఉండదు. తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి 22వ తేదీన జరిగే సమావేశంలో మన వాదన బలంగా వినిపించాలి. ఈ ప్రయత్నాలను కచ్చితంగా అడ్డుకోవాలి. లేదంటే ఆక్వా రంగం ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతుంది. –దుగ్గినేని గోపీనాథ్, రొయ్య రైతుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు


