ఉపరాష్ట్రపతి, కేటీఆర్‌లు మెచ్చిన పథకం..

Venkaiah Naidu And KTR Compliments to Municipal Corporation of Karimnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక్క రూపాయికే దహన సంస్కారాలు చేసేందుకు శ్రీకారం చుట్టిన కరీంనగర్‌ నగరపాలక సంస్థపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘అంతిమ యాత్ర.. ఆఖరి సఫర్‌’అంటూ కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన పథకంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీఆర్‌ఎస్‌స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్ కార్పొరేషన్‌, మేయర్‌ రవీందర్‌సింగ్‌కు అభినందనలు’అంటూ వెంకయ్యనాయుడు ట్వీట్‌లో పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌ సింగ్‌, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లను ప్రశంసించారు. పేదలకు ఎంతగానో ఉపయోగపడే పథాకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. ఇక అన్ని ప్రాంతాల్లోనూ ఈ పథకం సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తామని పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ తెలిపారు. ఇక సోమవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్‌ రవీందర్‌ సింగ్‌ ఈ పథకం గురించి వివరించారు. 

శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అంత్యక్రియలను కూడా నగరపాలక సంస్థ బాధ్యతగా చేపడుతుందని చెప్పారు. నిరుపేద కుటుంబాల్లో అంత్యక్రియలకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అప్పుల కోసం కాళ్లావేళ్లా పడటం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. అందుకే ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా వారి వారి సంప్రదాయాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు మంజూరు చేశామని, రెండు వ్యాన్‌లు, ఫ్రీజర్లు కూడా కొనుగోలు చేస్తున్నామని, పార్థివదేహాలను కాల్చేవారికి కట్టెలు, కిరోసిన్, పూడ్చిపెట్టే వారికి గొయ్యి తవ్వడం వంటివి సమకూర్చుతామని వివరించారు. జూన్‌ 15వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దాతలు కమిషనర్‌ అకౌంట్‌ ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చని, సీఎస్‌ఆర్‌ ద్వారా సేవ చేయాలనుకునే వారు తమతో కలసి పనిచేయాలని కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top