
జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిస్తున్న ప్రశాంత్‌రెడ్డి. చిత్రంలో జనార్దన్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు రాష్ట్రవ్యాప్తంగా ఏటా వేల మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. గ్రేటర్‌తోపాటు, రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో ఎక్కువ గా కుటుంబాల పెద్దదిక్కులే ఉండడంపై రహదారి భద్రత సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఏటా దాదాపు 6వేల మందికిపైగా ఈ ప్రమాదాల్లో చనిపోతున్నారు. మృతుల్లో 49% మంది 15 నుంచి 45 ఏళ్ల లోపువారే. వీరంతా కుటుంబాలను పోషిస్తున్న వాళ్లే. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డునపడుతున్నాయి. ప్రమాదాలను నియంత్రించేందుకు రహదారి భద్రత నిబంధనలను అమలు చేయడంతో పాటు పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటునివ్వడం ముఖ్యమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో సోమవారం రహదారి భద్రతపై హైదరాబాద్‌లో సదస్సు జరిగింది. రవాణా మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ పాల్గొన్ని ప్రసంగించారు.
విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు
‘డ్రైవర్ల నిర్లక్ష్యం, వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే 76%ప్రమాదాలు జరుగుతున్నాయని కృష్ణప్రసాద్ అన్నారు. ఇంట్లో సంపాదించే ముఖ్యమైన వ్యక్తే చనిపోతే కుటుంబం దిక్కులేనిదవుతుందన్నారు. పిల్లల్లో అవగాహన కల్పించేందుకు ‘రోడ్డు భద్రత’ను పాఠ్యాంశంగా మార్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వివిధ విభాగాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.