కాయగూరల్లో కాలకూటం!

కాయగూరల్లో కాలకూటం!


మూసీ నీళ్లతో పండించిన పంటల్లో ప్రమాదకర రసాయనాలు

 ఆర్సెనిక్, లెడ్, కాడ్మియం వంటి మూలకాల అవశేషాలు

 ఆరోగ్యాన్నే కాదు.. జీవనోపాధికి గండికొడుతున్న విష జలాలు

 ఈ నీటితో పోచంపల్లి చీరలకు రంగేస్తే ఎగుమతికి నిరాకరణ

 చెరువుల్లో చేపలు మృత్యువాత పడుతుండడంతో నష్టాలు

 నల్లగొండలో పలు గ్రామాలకు ఇప్పటికీ ఈ నీరే గతి

 ఫిల్టర్ నీళ్లు కొనలేక గరళాన్ని మింగుతున్న నిరుపేదలు

 

 సాక్షి, హైదరాబాద్: అణువణువునా విషం నింపుకున్న మూసీ... తీరప్రాంతంలో పండుతున్న కూరగాయల్లోకి సైతం కాలకూటాన్ని చొప్పిస్తోంది! ఈ నది ఒడ్డున పండుతున్న పంటలు, కూరగాయల్లో అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆరోగ్యానికి చేటుతెచ్చే ఆర్సెనిక్, లెడ్, బెరీలియం, సెలీనియం, కాడ్మియం వంటి మూలకాల జాడ లు వెలుగుచూశాయి. ఇంతగా విషతుల్యమైపోయిన మూసీ జలం నల్లగొండ జిల్లాలో అనేక గ్రామాల ప్రజలకు ఇప్పటికీ మంచి నీటిగా సరఫరా అవుతుండడం గమనార్హం. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నా మరో గత్యంతరం లేక నిరుపేదలు ఆ నీటినే గొంతు లో పోసుకుంటున్నారు. మూసీ దుష్ర్పభావం జనాల ఆరోగ్యం, పంటలకే పరిమితం కాలే దు.. ప్రజల జీవనోపాధికీ గండికొడుతోంది. ప్ర పంచ ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి చీరల నాణ్యతను దెబ్బతీస్తోంది. మూసీనీటితో రంగులు అద్దే చీరలను ఎగుమతికి అనుమతించడం లేదు. దీంతో చివరికి నేత కార్మికులు ఫిల్టర్ నీళ్లు కొని వాటిని చీరల తయారీకి వాడాల్సిన దుస్థితి ఏర్పడింది!

 

 పరిశోధనల్లో తేలింది ఇదీ..

 

 ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణల్లో వృక్షశాస్త్ర రీసెర్చ్ స్కాలర్ సుచిత్ర బృందం... వంకాయ, టమోటా, మిరప, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, ఉల్లిపాయ పంటలను పండించి ఫలితాలను విశ్లేషించింది. ఈ పంటలను పండించేందుకు 3 రకాల నీటిని (1. మూసీ నీరు, 2.బోరు నీరు, 3. శుద్ధి చేసిన మూసీ నీరు) వాడారు. కొద్ది నెలల తర్వాత మూసీ నీటితో పండిన పంటల్లో అత్యం త ప్రమాదకర మూలకాలను గుర్తించారు. వీటిలో కాపర్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, క్లోరైడ్, కాల్షియం మూలకాలు అత్యధిక మోతాదులో కనిపించాయి. ఇక అత్యంత ప్రమాదకరమైన ఆర్సెనిక్, లెడ్(సీసం), బెరీలియం, కాడ్మియం వంటి భారలోహాల ఆనవాళ్లు ఉన్న ట్టు తేలాయి. సాధారణ నీటితో పండిన టామోటాలో కాపర్ 0.76 మిల్లీగ్రాములు(ఎంజీ) నమోదు కాగా.. మూసీ నీటితో పండిన టమోటాలో అది 3.75 ఎంజీగా నమోదైంది. అలాగే క్యారెట్‌లో సాధారణ నీటితో 0.31 ఎంజీ కాపర్ ఉండగా.. మూసీనీటితో 2.71 ఎంజీ ఉంది. అలాగే సాధారణ నీటితో పండించిన మిరపలో 1.01 ఎంజీ కాపర్ నమోదు కాగా.. మూసీనీటితో పండించిన మిరపలో 2.26 ఎంజీ ఉంది. కార్పోహైడ్రేట్ల విషయానికి వస్తే సాధారణ  వంకాయ పంటలో 2.83 ఎంజీ ఉండగా, మూసీనీటి పంటలో మాత్రం 2.35 గానే నమోదైంది.

 

 సూర్యాపేటకు ఇవే మంచినీళ్లు

 

 కాగా.. మూసీ నీటినే ఇప్పటికీ సూర్యాపేట పట్టణానికి మంచినీటిగా అందిస్తున్నారు. అక్కడి మున్సిపాలిటీ.. నకిరేకల్ దిగువన నిర్మితమైన మూసీ డ్యాం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించి శుద్ధి చేసి పట్టణానికి అందిస్తోంది. రోగాలకు భయపడి చాలామంది ఫిల్టర్ నీటిని కొని తాగుతున్నారు. కొనే స్తోమత లేని నిరుపేదలు మున్సిపాలిటీ నీటినే వినియోగిస్తున్నారు.

 

 మూసీ శుద్ధికి నిపుణులు సూచించే మార్గాలివీ..

 

 పారిశ్రామిక వ్యర్థాలను పరిశ్రమ ఆవరణలోనే శుద్ధి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థాలను నాలాల్లోకి రాకుండా చూడాలి. రసాయన శుద్ధి కేంద్రాలు (ఈటీపీ) ఉన్న పరిశ్రమలకే అనుమతులు ఇవ్వాలి.

 వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.

 రసాయన  పరిశ్రమల్ని ఔటర్ రింగ్ రోడ్డు ఆవతలకు తరలించాలి.

 మూసీ ప్రక్షాళనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కదలాలి. గంగా శుద్ధి తరహాలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.

 

 కూకట్‌పల్లి, పికెట్ నాలాలను హుస్సేన్‌సాగర్‌లోకి రాకుండా మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ నాలాలను తాత్కాలికంగా దారి మళ్లించినా.. చివరకు ఆ నీరంతా వచ్చి చేరేది మూసీలోకే !

 హైదరాబాద్‌లోని నవాబ్‌సాహెబ్‌కుంట మొదలు హుస్సేన్‌సాగర్, ఫాక్స్‌సాగర్, సఫిల్‌గూడ, నాచారం, సరూర్‌నగర్ చెరువుల శుద్ధికి శాశ్వత ప్రణాళిక అమలు చేయాలి.

 

 భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కాలనీలు, పెద్దస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, అపార్ట్‌మెంట్‌లకు సైతం నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటు(ఎస్టీపీ)ను తప్పనిసరి చేయాలి.

 మూసీ తీరం వెంట కబ్జాలను తొలగించి గ్రీన్‌బెల్ట్‌ను ఏర్పాటు చేయాలి.

 

 ఈగల కంటే పెద్ద దోమలు

 మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలకు దోమల బెడద ఎక్కువుంది. సాయంత్రం 5.30 గంటలు దాటితే రోడ్డుపైకి రాలేని పరిస్థితి. ఈగల కంటే పెద్దగా ఉన్న ఈ దోమలు కుడితే దద్దుర్లు వస్తున్నాయి.

 - బి.సుశీలారెడ్డి, కాచవాని సింగారం, రంగారెడ్డి

 

 చీరలు ఎక్స్‌పోర్ట్‌కు వద్దంటున్నారు

 గత ఐదారేళ్లుగా మూసీ నీరు చాలా కలుషితమైంది. ఈ నీరు రంగుల అద్దకానికి పనికి రాకుండా పోయింది. మూసీ నీటితో మైల పూర్తిగా పోదు.అట్లే రంగులద్దితే నూలుకు రంగు ముద్దలుముద్దలుగా అంటుకుంటుంది. మూసీ నీటితో రంగులు అద్దే చీరలను ఎక్స్‌పోర్ట్‌కు అనుమతించటం లేదు. మండలానికి కృష్ణా జలాలు అందిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.                                    

    - అంకం యాదగిరి, పోచంపల్లి చేనేత కార్మికుడు

 

 జబ్బుల బారిన పడుతున్నాం

 మూసీ పరివాహక ప్రాంతంలో నీళ్లు తాగి అనారోగ్యం పాలవుతున్నాం. నీళ్లు తాగితే ఒళ్లు, తలనొప్పులు వస్తున్నాయి. స్నానం చేస్తే దద్దులు వస్తున్నాయి. 40 సంవత్సరాలు పైబడిన వారికి అనేక జబ్బులు వస్తున్నాయి. ఈ నీళ్లతో పొద్దున అన్నం వండితే మధ్యాహ్నానికే పాడై పోతుంది.        

     - దేరంగుల యాదమ్మ, ప్రతాప్‌సింగారం, రంగారెడ్డి

 

 నీళ్లు అడిగి అలసిపోయాం

 మాకు కృష్ణా నీళ్లు ఇవ్వాలని ఏన్నో ఏండ్లుగా అడుగుతనే ఉన్నం. మూసీనీళ్లను ఒక్కోసారి సరిగ్గా శుద్ధి చేయకుండానే నల్లాలోకి వదులుతున్నారు. ఈ నీళ్లతో అన్నం వండితే రెండు గంట ల్లోనే పాడై పోతోంది.    

 - భీంశెట్టి శైలజ,

 అన్నాదురై నగర్, సూర్యాపేట

 

 

 గ్రీజు పూసుకొని చెరువులోకి దిగుతున్నాం

 చెరువులోకి దిగి చేపలు పట్టాలంటే మత్స్య కార్మికులు భయపడుతున్నారు. చెరువులోకి దిగితే దురద, మంట పుడుతోంది. దాంతో గ్రీజు పూసుకొని చేపలు పట్టుతున్నాం. చేపలు కూడా ఎదగడం లేదు. రెండేళ్లు పెంచితే 2-3కిలోల బరువు మాత్రమే పెరు గుతున్నాయి. గతంలో ఐదారు కిలోలు పెరిగేవి.    

 - చెక్క గణేష్,

 మత్స్య కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు, పోచంపల్లి

 

 

 ఏం చేస్తాం.. మరే నీళ్లు లేవు

 

 మాకు మరో గత్యంతరం లేదు. మూసీ నీళ్లు తాగక తప్పటం లేదు. అవయినా మూడు రోజులకోసారి ఇస్తున్నారు. ఒక్కోసారి గలీజు వాసన వస్తే రూ.15లతో ఫిల్టర్ నీటిని కొనుక్కొని తాగుతున్నం.    

 - నర్సింగ్ సైదమ్మ, తాళ్లగడ్డ, సూర్యాపేట

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top