కూరల ధరలు పైపైకి..!

Vegetable  Prices Hikes in Hyderabad Markets - Sakshi

వేసవికి ముందే మండుతున్న కూరగాయల ధరలు

శివారు నుంచి తగ్గినదిగుమతులు

మార్చి నుంచి మరింత పెరిగే అవకాశం

ఇక ఆఫ్‌ సీజన్‌ కమీషన్‌ ఏజెంట్లకు పండగే

సాక్షి,సిటీబ్యూరో: నగర మార్కెట్‌లో గత వారం రోజులుగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సాధారణంగా మార్చి చివరి వారంలో మొదలయ్యే ఈ ధరాఘాతం ఈసారి ఫిబ్రవరి ప్రారంభం నుంచే మొదలైంది. దీంతో సామన్య ప్రజలు మార్కెట్‌ పెరు చెబితే జడుసుకుంటున్నారు. చలికాంలో నిలకడగా ఉండే ధరలు అప్పుడే పెరగడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ ధరలు సాధారణ ప్రజలకు అందనంతగా పెరుగుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టమాటాతో పాటు అన్ని రకాల కూరగాయల ధరలు రైతుబజార్లలోనే అధిక ధరలు ఉండగా.. ఇక బహిరంగ మార్కెట్‌లో రెండింతలకు పెరిగాయి.

మార్కెటింగ్‌ శాఖ ధరల నియత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న దాదాపు కోటి మంది జనాభాకు ప్రతిరోజు సుమారు 3 వేల టన్నుల కూరగాయలు అవసరం. వర్షకాలం, చలికాలంలో స్థానికంగా కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉండడంతో ధరలు కూడా సహజంగానే తక్కువగా ఉంటాయి. ఇక ఆఫ్‌ సీజన్‌ (ఫిబ్రవరి నుంచి జూలై)లో 70 శాతం కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం ఆఫ్‌ సీజన్‌ మొదలవడంతో కూరగాయలను పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది శివారు జిల్లాలైన వికారబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌ రైతులు కూరగాయలు పండించడంతో నగరానికి ఎక్కువ దిగుమతయ్యేవి. దీంతో జనవరి వరకు ధరలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు దిగుమతులు ఎక్కువగా ఉండడంతో ధరలు కూడా పెరగలేదు. 

ఆఫ్‌ సీజన్‌ ఏజెంట్లకు పండగ
ఫిబ్రవరి– జూలై నెలల మధ్య (ఆఫ్‌ సీజన్‌) స్థానికంగా కూరగాయల పంటలు పెద్దగా ఉండవు. దీంతో కమీషన్‌ ఏజెంట్లు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు దిగుమతి చేస్తుంటారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకు కూరగాయలు కొనాల్సిందే. దీంతో ధరలు పెంచి కమీషన్‌ ఏజెంట్లు భారీగా దండుకుంటారు.

ఈ ఏడాది వేసవి కంటే ముందు నుంచే కూరగాయల ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. పది రోజుల నుంచి శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గాయి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకు కూరగాయల ధరలు పెరుగరుతాయి.    – కె.శ్రీధర్, స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి,గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top