కేటీఆర్‌పై కేసు పెట్టాలని, సిరిసిల్ల ఎస్పీని సస్సెండ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్(రాజన్న సిరిసిల్ల జిల్లా): తంగళ్లపల్లి మండలం నేరెళ్ల దళితులపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించినందుకు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై కేసు పెట్టాలని, సిరిసిల్ల ఎస్పీని సస్సెండ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. పోలీసుల చేతిలో థర్డ్‌డిగ్రీకి గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ.. నెలరోజుల వ్యవధిలో ఇసుకలారీలతో ముగ్గురు మరణించగా.. ఆక్రోశంతో ప్రజలు లారీలను తగులబెడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. దొంగల్లా రాత్రి వచ్చి.. 8మందిని కిడ్నాప్ చేసి.. నాలుగు రోజులు థర్డ్ డిగ్రీ ఇస్తారా..? వారేమైనా నక్సలైట్లా..? అంత చిత్రహింసలు ఎందుకు పెట్టారు..? అని ప్రశ్నించారు. ఒక్క కుటుంబం బతకడానికి పేద దళిత, బీసీ కుటుంబాలను చంపుతారా..? అని ప్రశ్నించారు. ఎస్పీ కొట్టీ మాట మార్చుతున్నారని, నాలుగురోజులు నిర్బంధించి.. ఒక్కరోజులోనే కోర్టులో హాజరుపర్చాం అంటూ కమిషన్ ముందు చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. దళితులపై ఇంతజరిగినా.. సర్కార్‌కు కనిపించకపోవడం శోచనీయమన్నారు. బాధితులకు తగిలిన గాయాలను చూసిన జైలర్.. వారిని వెనక్కిపంపడంతోనే ఈ దారుణం వెలుగుచూసిందని గుర్తుచేశారు.
అవినితీ, ఇసుకమాఫియా గురించి ప్రశ్నిస్తే మంత్రి కేటీఆర్ తిరగబడి మాట్లాడటం సబబు కాదన్నారు. మంత్రి కేటీఆర్ వయసుకు తగిన మాటలు మాట్లాడాలని సూచించారు. జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలనిని కోరితే.. హోంమంత్రి ఒకలా, మంత్రి కేటీఆర్ మరోలా అహంకారంతో మాట్లాడుతున్నారని వాపోయారు. కొట్టిన దెబ్బలు చెప్పుకుంటే దళిత మహిళలపై వ్యభిచారం కేసులు పెడతారా..? మగవాళ్లపై గంజాయి కేసులు పెడతారా..? ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్‌ను వెంటనే సస్సెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దురాగతంపై చలో నేరెళ్ల కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లలో భారీ బహిరంగ సభను ఈనెల 31న నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.