
సాక్షి, సిరిసిల్ల: గంభీరావుపేటలో ఆర్మీ హెలికాప్టర్ రెస్య్కూ ఆపరేషన్ విజయవంతమైంది. ఆర్మీ హెలికాప్టర్ సాయంతో నర్మాలలో మానేరువాగు మధ్యలో చిక్కుకున్న ఐదుగురు రైతులను కాపాడారు. సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు. కాగా, పశువులు మేపేందుకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన రైతులు బుధవారం మధ్యాహ్నం వాగులో చిక్కుకుని ఎత్తైన గడ్డ మీద ఉన్నారు.
ఈ క్రమంలో వీరికి డ్రోన్ ద్వారా అధికారులు ఆహారం అందించారు. రైతుల వద్దకు బోట్ల ద్వారా చేరుకోలేమని, హెలికాప్టర్ల ద్వారా మాత్రమే తీసుకొచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. మానేరు వరదలో ఇప్పటికే నాగయ్య(50) గల్లంతయ్యాడు. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్.. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వరదల్లో దాదాపు 30 మంది చిక్కుకున్నారని తెలిపారు. బాధితులను కాపాడేందుకు వైమానికదళ హెలికాప్టర్ పంపాలని కోరారు. బండి సంజయ్ విజ్ఞప్తిపై రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నర్మాలకు ఆర్మీ హెలికాప్టర్ చేరుకుంది.
మరోవైపు.. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఆర్మీ హెలికాప్టర్ నర్మాలలో సహాయక చర్యల్లో నిమగ్నమైన విషయాన్ని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేందుకు అవసరమైతే మరిన్ని NDRF టీంలను పంపేందుకు సిద్దంగా ఉన్నట్టు బండి సంజయ్ వెల్లడించారు.