మళ్లీ అన్యాయం చేయొద్దు 

ustice Dharmadhikari Held Meeting On Electricity Employees Division Between TS And AP - Sakshi

అన్ని నియామకాల్లో తెలంగాణకు అన్యాయమే జరిగింది

ఇంజనీర్లలో స్థానికులు 28% 

జస్టిస్‌ డీఎం ధర్మాధికారి ముందు తెలంగాణ సంఘాల వాదన 

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థలో జరిగిన నియామకాలన్నింటిలో రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని, కేవలం 28 శాతం మంది మాత్రమే తెలంగాణ స్థానికత కలిగిన వారున్నారని తెలంగాణ విద్యుత్‌ సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. శనివారం ఇక్కడ విద్యుత్‌ ఉద్యోగుల విభజన కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ డీఎం ధర్మాధికారి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్‌ అసోసియేషన్, తెలంగాణ పవర్‌ డిప్లొమా ఇంజనీర్స్‌ అసోసియేషన్, అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగ సంఘాలు కమిషన్‌ ముందు తమ వాదనలను వినిపించాయి. తెలంగాణ డిస్కంలు చేసిన 1,157 మంది ఉద్యోగులకే విభజన ప్రక్రియ పరిమితం చేయాలని సంఘాలన్నీ ముక్తకంఠంతో కోరాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏడాది లోపు ఆయా సంస్థలే ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు సిద్ధం చేసుకుని, విభజన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని కానీ ఏడాది వేచిచూసిన తర్వాతే తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఏపీ స్థానికత కలిగిన 1,157 మంది ఉద్యోగులను రిలీవ్‌ చేశాయని నివేదించాయి.

హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ప్రక్రియలో 612 మంది ఏపీకి వెళ్తామని ఆప్షన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఏపీ సంఘాలు, సంస్థలు చెప్తునట్లుగా రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలనే వాదన సరైంది కాదన్నారు. 2008 దాకా విద్యుత్‌ సంస్థలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయలేదని, అప్పటిదాకా జరిగిన అన్ని నియామకాల్లోనూ తెలంగాణ స్థానికత కలిగిన వారు 28శాతం ఉండగా, ఏపీ స్థానికత కలిగిన ఇంజనీర్ల వాటా 72 శాతంగా ఉందని పేర్కొన్నారు. కమల్‌నాథన్‌ కమిటీ మార్గదర్శకాలు కార్పొరేషన్లకు వర్తించవని గుర్తు చేశారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఏ రాష్ట్రంలో నాలుగేళ్లు గరిష్టంగా చదివితే అదే రాష్ట్రాన్ని స్థానికంగా పరిగణనలోకి తీసుకుని విభజన ప్రక్రియను పూర్తి చేయాలని సంఘాలు పేర్కొన్నాయి. దీంతో ఆదివారం కూడా విద్యుత్‌ సంస్థల ప్రతినిధులతో జస్టిస్‌ ధర్మాధికారి భేటీ కానున్నారు. సమావేశానికి తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ దినేశ్‌ పరుచూరి, తెలంగాణ ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు, డిస్కంల సీఎండీలు హాజరయ్యారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top