
ఎలాంటి గైడ్ సూచనలు లేకుండా రైడింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, వికారాబాద్ : జిల్లాలోని ధరూర్ మండలం గోధమగూడలోని హిల్స్ అండ్ వాలీ అడ్వెంచర్ రిసార్ట్‌లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. మౌంటెన్ బైక్ నడుపుతున్న సమయంలో ఎన్నారై అరవింద్‌కుమార్ పీచర (45) అనే వ్యక్తి ప్రమాదానికిగురై ప్రాణాలు విడిచాడు. అతను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఎలాంటి గైడ్ సూచనలు లేకుండా రైడింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై అరవింద్ స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిన్న గుట్టపై నుంచి వస్తున్న క్రమంలో మౌంటెన్ బైక్ తిరగబడిందని, ప్రమాదంలో అరవింద్ తలకు తీవ్రగాయాలయ్యాయని అతని స్నేహితులు చెప్పారు. వికారాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వెల్లడించారు. డల్లాస్‌లో నివాసముండే అరవింద్ స్నేహితుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చినట్టు తెలిసింది.