
నల్లగొండ అగ్రికల్చర్ : మూడు రోజులుగా జిల్లాకు సరఫరా ప్రారంభమైందని జిల్లా వ్యవసాయ అధికారి జి. శ్రీధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 346 టన్నుల యూరియా జడ్చర్ల వ్యాగన్ పాయిం ట్ ద్వారా, 1200టన్నుల యూరియా ఐపీఎల్ కంపెనీ ద్వారా, స్పిక్ కంపెనీ ద్వారా 1025 టన్నులు మొత్తం రూ.2571 టన్నుల యూరియా చేరుకుందని, దీనిని మార్క్‌ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు, ప్రైవేట్ డీలర్ల ద్వారా జిల్లాలోని రైతులందరికీ సరఫరా చేస్తామన్నారు. సోమవారం 1200 టన్నుల యూరియా ఇఫ్కో కంపెనీ ద్వారా మిర్యాలగూడ వ్యాగన్ పాయింట్‌కు చేరుకుందని, మంగళవారం ఉదయం లోపు అన్ని మండలాల్లో పీఏసీఎస్‌లకు, ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేస్తామన్నారు. యూరియా అధికంగా అవసరం ఉన్న 11 మండలాలకు 2,100టన్నుల యూరియాను రోడ్డు మార్గం ద్వారా కృష్ణపట్నం పోర్టు నుంచి పంపించడానికి కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఇవికూడా రావడం ప్రారంభమైందని, రెండు మూడు రోజుల్లో అన్ని మండలాలకు రోడ్డు మార్గం ద్వారా రానుందన్నారు. రైతులు యూరియా గురించి ఆందోళన చెందవద్దని, అవసరాల మేరకే కొనుగోలు చేసి వాడుకోవాలన్నారు. యూరియాను ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేసుకోవద్దని సూచించారు.