‘పల్లె వెలుగులు’ ఏవీ?

Unavailability Of Buses In Addagudur Village - Sakshi

     మారుమూల గ్రామాలకు కాలినడకే శరణ్యం

     బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న మండల ప్రజలు 

సాక్షి, అడ్డగూడూరు : మండల కేంద్రంతో పాటుగా మండల పరిధిలోని వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెవెలుగు బస్సులు పల్లెలకు కాకుండా పట్టణాలకే పరిమితమవుతున్నాయి. దీంతో పల్లె ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యంలేక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయాణికులకు తప్పని తిప్పలు
మండలం నుంచి ప్రజలు, విద్యార్థులు మోత్కూర్, నల్లగొండ, భువనగిరి, హైదరాబాద్, తిరుమలగిరి, సూర్యాపేట, జనగాం, తొర్రూరు, వరంగల్‌ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే సరియైన బస్సు సౌకర్యం లేకపోవడంతో వారు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారు. పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోల కోసం పడిగాపులు కాస్తుంటారు. లేదంటే కాలినడకనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక వర్షాకాలంలో ప్రయాణికుల బాధలు వర్ణణాతీతం. గ్రామాల స్టేజీల నుంచి గ్రామంలోకి వర్షంలోనే నడుచుకుంటూ రావాల్సి వస్తోంది.
ఆటోలే శరణ్యం..
గ్రామాలు బాగుపడాలంటే ఆ గ్రామాల్లో ప్రధానంగా రోడ్డు, రవాణా సౌకర్యం ఉండాలి. ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి మధ్య అనుసంధానం చేసేది రవాణా వ్యవస్థనే. కానీ పాలకుల  నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం వల్ల మండలంలోని చాలా గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలను నమ్ముకుని ప్రయాణించాల్సి వస్తోంది. 
బస్సు సౌకర్యం లేని  గ్రామాలు
మండలంలోని మొత్తం 17 గ్రామపంచాయతీలు ఉండగా కేవలం నాలుగు గ్రామాలకే బస్సు సౌకర్యం ఉంది. చౌళ్లరామారం, అడ్డగూడూరు, ధర్మారం, చిర్రగూడూర్, కంచనపల్లి, బొడ్డుగూడెం, కోటమర్తి, డి.రేపాక మంగమ్మగూడెం, గ్రామాలకు బస్సు సౌకర్యంలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామాలకు ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించాలని పాలకులను వేడుకున్నా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామాల స్టేజీలవద్ద గ్రామం పేరు తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

బస్సు సౌకర్యం కల్పించాలి
బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీవారు స్పందించి గ్రామాల్లో బస్సు సౌకర్యం కల్పించాలి.
 
 –  తుప్పతి మధు, అడ్డగూడూరు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top