నయాపూల్‌ ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణుల మృతి | Two pregnant women died at the Nayapul hospital | Sakshi
Sakshi News home page

నయాపూల్‌ ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణుల మృతి

Dec 7 2017 3:56 AM | Updated on Oct 9 2018 7:52 PM

Two pregnant women died at the Nayapul hospital - Sakshi

హైదరాబాద్‌:  హైదరాబాద్‌లోని నయాపూల్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు గర్భిణులు మృతి చెందారు. గర్భిణుల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ వారి బంధువులు ఆందోళనకు దిగగా, ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే వారు చనిపోయారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. బీదర్‌కు చెందిన షబానా బేగం(21) కిషన్‌బాగ్‌లోని తన బంధువుల ఇంట్లో ఉంటూ పేట్లబురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది.

వైద్యులు వైద్యం అందిస్తుండగా రాత్రి 11.30 గంటలకు మృతి చెందింది. విషయం తెలుసుకున్న బంధువులు కిషన్‌బాగ్‌ మజ్లిస్‌ కార్పొరేటర్‌తో కలసి ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చార్మినార్‌ పోలీసులు వచ్చి ఆందోళనకారులను శాంతింపజేశారు. అదే ఆసుపత్రిలో బుధవారం మరో గర్భిణి మృతి చెం దింది. 2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా యాలాల మండలానికి చెందిన షాహిన్‌(22) ప్రసవం కోసం నయాపూల్‌ ఆసుపత్రిలో చేరింది. బుధవారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందింది. సరైన వైద్యమందకపోవడం వల్లే తన భార్య మృతి చెందిందని ఆమె భర్త మౌలానా ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ ఎక్కువై ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు.  

వైద్యుల వైఫల్యం లేదు: సూపరింటెండెంట్‌ 
గర్భిణులు మృతి చెందడంలో వైద్యుల నిర్లక్ష్యం ఏమీలేదని, వారికి సకాలంలో వైద్య సేవలు అందించామని నయాపూల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగమణి తెలిపారు. షబానా బేగం నాంపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీవ్ర అనారోగ్యానికి గురై చివరి నిమిషంలో ఆసుపత్రిలో చేరారని, ఆమెకు ఫిట్స్‌ రావడంతో మృతి చెందిందని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement