
రామకృష్ణ , రామస్వామి మృతదేహాలు
చందంపేట : అప్పటి వరకు బంధువుల హడావుడితో కళకళలాడిన ఆ పెళ్లింట విషాదం నెలకొంది... పెళ్లి తంతు ముగిసిన అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివాహ వేడుకలో మునిగి ఉన్న బంధువులలో ఇద్దరు మృత్యువాతపడడంతో ఆ ఇంట శోకం నిండింది.. చందంపేట మండలం గన్నెర్లపల్లి మూలమలుపు వద్ద బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన ఎదుళ్ల వెంకట్, డిండి మండలం ఎర్రారం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి వివాహం గురువారం ఎర్రారం గ్రామంలో జరిగింది.
వివాహ వేడుక ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో డీసీఎంలో బంధువులు బయలుదేరగా కంభాలపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రామకృష్ణ(35), నేరెడుగొమ్ము మండలం పేర్వాల గ్రామానికి చెందిన దారముల రామస్వామి(42), కంభాలపల్లి గ్రామానికి చెందిన ఆనందం బైక్‌పై బయల్దేరారు. అయితే మార్గమధ్యలో చందంపేట మండలం గన్నెర్లపల్లి వద్ద మూలమలుపు వద్ద వీరి బైక్ విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న రామకృష్ణ, రామస్వామి మృత్యువాతపడగా ఆనందం పరిస్థితి విషమంగా ఉంది.