
చిన్నశంకరంపేట/బొమ్మలరామారం/పరకాల: ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట యమపాశంగా తయారైంది. విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, తాజాగా మెదక్ జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌కి చెందిన చాకలి రాజు(18) ఇంటర్ ఫెయిల్ అయ్యా నని చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన రాజు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో అన్ని సబ్జెక్టులు పాసయ్యాడు. తాజాగా సెకండియర్ రిజల్ట్‌లో ఎకనమిక్స్‌లో 08 మార్కులు, సివిక్స్‌లో 27 మార్కులు మాత్రమే రావడంతో ఫెయిల్ అయ్యాడు.
మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లిలో మితి (19) అనే ఇంటర్ విద్యార్థిని ఫెయిల్ అయ్యానన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. మితి బీబీనగర్ మండలంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ బైపీసీ రెండో ఏడాది పూర్తిచేసింది. ఇటీవల ఫలితాల్లో మితిæ జువాలజీ, కెమిస్ట్రీల్లో ఫెయిలైంది. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా బుధవారం తెల్లవారుజామున మితి ఉరి వేసుకుంది.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఐరబోయిన సింధు ఇంటర్ ఫస్టియర్‌లో బోటనీ సబ్జెక్ట్‌లో ఫెయిల్ కావడంతో బుధవా రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింధు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.