టీవీ9తో రవిప్రకాశ్‌కు సంబంధం లేదు: డైరెక్టర్లు

TV9 Appoints New CEO Announced Board Directors - Sakshi

టీవీ9 కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రా

సీఈవో, డైరెక్టర్‌గా రవి ప్రకాశ్‌ను తొలగిస్తున్నాం

సెక్రటరీ సంతకాలు ఫోర్జరీ చేశారు

90.5 శాతం వాటాలు అలందా మీడియావే: బోర్డు డైరెక్టర్లు

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 సీఈవో, డైరెక్టర్‌ పదవి నుంచి రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నట్లు ఈ సంస్థ డైరెక్టర్లు ప్రకటించారు. టీవీ9 సంస్థలో చోటుచేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో బోర్డుసభ్యులు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రవి ప్రకాశ్‌ స్థానంలో కొత్త సీఈవోగా మహేంద్ర మిశ్రాను, సీవోవోగా గొట్టిపాటి సింగారావు నియమిస్తున్నట్లు అలందా మీడియా డైరెక్టర్‌ ఎస్‌ సాంబశివరావు ప్రకటించారు. సంస్థలో అవకతవకలు చోటుచేసుకున్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే డైరెక్టర్ల సమావేశం నిర్వహించి మే 8న ఆయనను పదవి నుంచి తొలగించామని తెలిపారు.

9 నెలల క్రితమే టీవీ9లో 90.5 శాతం వాటాలను ఏవీసీఎల్‌ నుంచి అలందా మీడియా కొనుగోలు చేసిందని, కొనుగోలు అనంతరం సంస్థలో చాలా అవరోధాలు సృష్టించారని, సంస్థలో 8శాతం వాటా ఉన్న వాళ్లు నియంత్ర చేయాలని చూశారని వెల్లడించారు. డైరెక్టర్ల సమావేశం జరగకుండా రవి ప్రకాశ్‌, మూర్తి అడ్డుపడ్డారని అన్నారు. వాటాదార్లందరి అభిప్రాయం మేరకే రవిప్రకాశ్‌ను తొలగిస్తున్నామని ఆయన ప్రకటించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవి ప్రకాశ్‌ ఫోర్జరీ చేశారని ఆయన వెల్లడించారు. తన సంతకాన్ని రవి ప్రకాశ్‌ ఫోర్జరీ చేశారని కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాలే స్వయంగా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

యజమాన్య మార్పిడి జరగకుండా రవి ప్రకాశ్‌, మూర్తి ఎన్నో అవరోధాలు సృష్టించారని, తప్పుడు నిర్ణయాలతో సంస్థను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినట్లు తెలిపారు. ప్రస్తుతం టీవీ9లోని అన్ని ఛానెళ్లు కొత్త సంస్థ పరిధిలోకి వస్తామని స్పష్టం చేశారు.  తాజా ఘటన నేపథ్యంలో టీవీ9తో రవిప్రకాశ్‌, మూర్తిలకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. అలాగే వాళ్లిదరూ ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు జరిపితే మాకంపెనీకి ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు. టీవీ9 సంస్థలలోకి కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రవి ప్రకాశ్‌తో పాటు మిగతా వారికి 9.5 శాతం వాటాలు ఉన్నాయని, షేర్‌హోల్డర్‌గా రవిప్రకాశ్‌ సమావేశాలకు హజరుకావచ్చని బోర్డు డైరెక్టర్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top