 
													సాక్షి, సంగారెడ్డి: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తొలి అడుగు పడింది. రాత్రి 8 గంటల వరకే మహిళా కండక్టర్లు విధులు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ఆయా డిపోలకు ఉత్తర్వులు అందాయి. దీనికి అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోలున్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం 2,811 మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో మహిళలు 298 మంది ఉన్నారు. రీజియన్‌లో మహిళా కార్మికులు ప్రతీ రోజు రాత్రి 8 గంటలలోగా విధులు ముగించే విధంగా షెడ్యూల్‌ను రూపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరికి విధులు కేటాయించడంలో నాలుగైదు రోజులుగా కసరత్తు చేస్తున్నారు.
డిపోల వారీగా మొత్తం ఉద్యోగుల వివరాలు..
| డిపో | మొత్తం ఉద్యోగులు | మహిళా ఉద్యోగులు | 
| సంగారెడ్డి | 528 | 67 | 
| జహీరాబాద్ | 430 | 43 | 
| నారాయణఖేడ్ | 284 | 14 | 
| మెదక్ | 413 | 44 | 
| సిద్దిపేట | 441 | 49 | 
| దుబ్బాక | 176 | 15 | 
| హుస్నాబాద్ | 235 | 35 | 
| గజ్వేల్ | 304 | 31 | 
| మొత్తం | 2,811 | 298 | 
విధుల నిర్వహణపై ప్రత్యేక చార్టులు ఏర్పాటు కసరత్తు ప్రారంభించారు. ఎలాంటి రూట్లలో విధులు కేటాయిస్తే..రాత్రి 8 గంటల్లోపు పూర్తవుతుందో నివేదిక రూపొందించి దాని ప్రకారమే మహిళలకు డ్యూటీలు కేటాయించే పనిలో ఉన్నారు. ఈ నెల 15తేదీలోగా వీరికి విధుల చార్ట్ సిద్ధం చేసే ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. ఉదయం 5 గంటలకు విధుల్లో చేరిన వారు మధ్యాహ్నం 1 గంట వరకు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. వారు మరుసటి రోజు అదే సమయానికి డ్యూటీలో చేరాలి. స్పెషల్ ఆఫ్ డ్యూటీ చేసే వారు ఉదయం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయాలి. వీరికి మరుసటి రోజు మొత్తం డ్యూటీ ఉండదు. ఆ తరువాత రోజున డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఇలా ఏ రకమైన డ్యూటీ చేసినా రాత్రి 8 గంటలకు మించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
42 మంది ఉద్యోగుల క్రమబద్దీకరణ
కేసీఆర్ హామీల్లో భాగంగా మెదక్ రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో పనిచేస్తున్న 42 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. సంగారెడ్డి డిపోలో 18 మంది డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, నారాయణఖేడ్‌లో ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, జహీరాబాద్‌లో 14 మంది డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, సిద్దిపేట డిపోలో ఒక కండక్టర్ ఉద్యోగాన్ని క్రమబద్దీకరించారు.
మంచి పరిణామం
రాత్రి 8 గంటల వరకే ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం, అమలుకు నోచుకోబోతుండడం మంచి పరిణామం. మహిళలకు రాత్రి వేళల్లో డ్యూటీలు వేస్తే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబపరంగానూ, భద్రత పరంగానూ రాత్రి వేళల్లో డ్యూటీలు చేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధలు గుర్తించడం హర్షణీయం. 
– సుకన్య, కండక్టర్, జహీరాబాద్ డిపో
15లోగా డ్యూటీ చార్ట్ రూపొందిస్తాం 
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన మాట వాస్తవమే. మహిళా ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించి రాత్రి 8 గంటల వరకే విధులు నిర్వహించేలా డ్యూటీ చార్ట్‌ను రూపొందించే పని తుది దశకు చేరింది. ఈ నెల 15తేదీలోగా మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోగా విధులు ముగిసే విధంగా డ్యూటీలు కేటాయిస్తాం. 
– రాజశేఖర్, ఆర్‌ఎం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
