‘ముసద్దిలాల్‌’కు హైకోర్టులో చుక్కెదురు | TS High Court Dismisses Musaddilal Owners Petition | Sakshi
Sakshi News home page

‘ముసద్దిలాల్‌’ నిర్వాహకుల పిటిషన్‌ కొట్టివేత

May 22 2019 7:03 PM | Updated on May 22 2019 7:05 PM

TS High Court Dismisses Musaddilal Owners Petition - Sakshi

ఆరోజు బంగారం కొనలేదని చెప్పడంతో బయటపడ్డ భారీ స్కాం..

సాక్షి, హైదరాబాద్‌ : మనీలాండరింగ్‌కు పాల్పడ్డ ముసద్దిలాల్‌ జ్యువెల్లరి నిర్వాహకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ జ్యువెల్లరి నిర్వాహకులు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్‌ విక్రయాలకు పాల్పడిన కేసులో ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు మొత్తం రూ. 110.85 కోట్ల గోల్‌మాల్‌కు సంబంధించి చార్జిషీట్‌ దాఖలు చేయగా.. ఈడీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.

ఈ క్రమంలో ముసద్దీలాల్‌తో పాటు దాని అనుబంధ సంస్థలు, కుంభకోణంతో ప్రమేయమున్న సంస్థలు, కైలాష్‌ గుప్తా, నిఖిల్‌ గుప్తా సహా కొందరు యజమానుల ఇళ్లపై వరుస దాడులు చేసింది. ఈ సోదాల్లో లభించిన రూ. 82.11 కోట్ల విలువైన 145.89 కేజీల బంగారాన్ని ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు తమకు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ ముసద్దిలాల్‌ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు.

ఆరోజు బంగారం కొనలేదని చెప్పడంతో బయటపడ్డ స్కాం..
2016 నవంబర్‌ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడగా ముసద్దిలాల్‌ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు ముసద్దిలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల కేంద్రంగా ‘విక్రయాల’స్కెచ్‌ రెడీ చేసింది. ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5,200 మంది వినియోగదారులు రూ. 97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్‌ అడ్వాన్స్‌ పేమెంట్‌ రసీదులు సృష్టించింది. బోగస్‌ రసీదులతోపాటు కస్టమర్ల వివరాలంటూ కొందరి ఆధార్‌ కార్డుల నకళ్లను జత చేసింది. వినియోగదారుల పాన్‌ నంబర్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ప్రతి లావాదేవీని రూ. 2 లక్షలలోపు చూపింది. ఆ మొత్తాన్ని హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఎస్‌బీఐ, బంజారాహిల్స్‌లోని యాక్సెస్‌ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసింది.

ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపుపన్నుశాఖ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. యాజమాన్యం సమర్పించిన గుర్తింపు పత్రాలకు చెందిన వ్యక్తులను పోలీసులు విచారించగా ఆ రోజు తాము బంగారమేదీ కొనలేదని వారు చెప్పారు. ముసద్దిలాల్‌ సంస్థల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా నోట్ల రద్దు రోజున కేవలం 67 మంది వినియోగదారులే వచ్చినట్లు వెల్లడైంది. అలాగే బిల్లులన్నీ నోట్ల రద్దు తేదీ తర్వాతే నమోదయ్యాయని పోలీసులు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ను విశ్లేషించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించింది. దీంతో సంస్థ మోసం బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement