హైకోర్టులో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు

TS High Court centenary celebrations held in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ హైకోర్టులో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, ఎల్ నాగేశ్వరరావులు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్, ఇతర న్యాయ మూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 

చారిత్రాత్మకమైన హైకోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్ చౌహన్ అన్నారు. హైకోర్టులాంటి అద్భుతమైన నిర్మాణంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైకోర్టు క్యాంపస్ వాతావరణం న్యాయవాదులకు చాలా అనుకూలంగా ఉంది. వీలైనంత తొందరలో హైకోర్టు పెండింగ్ ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సామాన్యులకు న్యాయం అందేలా చూస్తామని చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో న్యాయమూర్తుల నియామకం పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కోర్టులలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 1 లక్ష 93 వేల కేసులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో 1 లక్ష 73 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న  కేసులను న్యాయ పరంగా త్వరగా పరిష్కరించాలని సూచించారు. యువ న్యాయవాదులకు కేసుల్లో వాదనలు వినిపించేందుకు ఇది మంచి అవకాశం అన్నారు.

హైదరాబాద్ హైకోర్టుతో 31 సంవత్సరాల అనుభవం ఉందని జస్టీస్ ఎన్ వి రమణ అన్నారు. ఇది చాలా ఎమోషనల్ డే అని, తన సగం జీవితం ఈ కోర్టులోనే గడిచిందన్నారు. తన పుట్టినింటికి ఈరోజు వచ్చినందకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం కృషిచేస్తానని, హైకోర్టు ఇతర సమస్యలు సైతం త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top