గులాబీ ధూంధాంకు రంగం సిద్ధమైంది.
హైదరాబాద్ : గులాబీ ధూంధాంకు రంగం సిద్ధమైంది. పద్నాలుగేళ్ల ప్రయాణం.. ఉద్యమాల ప్రస్థానం.. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిందన్న గౌరవం.. కొత్త రాష్ట్ర తొలి ఎన్నికల్లోనే అధికార పీఠం కైవసం.. వీటన్నింటినీ ప్రతిబింబించేలా, దాదాపు ఏడాది పాలనపై ప్రచారమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చాక ఇదే తొలి ప్లీనరీ సమావేశం కావడం విశేషం.
హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో మరికాసేపట్లో ప్లీనరీ మొదలు కానుంది. ప్లీనరీలో 12 తీర్మానాలను ఆమోదించనున్నారు. మరోవైపు ప్లీనరీలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా కళాకారులతో కలిసి గొంతు కలుపుతున్నారు. పార్టీ నేతలు గులాబీ కండువాలు ధరించి ప్లీనరీ వేదికపై ఆసీనులయ్యారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. మరోవైపు సైకిల్ దిగి కారు ఎక్కిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మెడలో గులాబీ కండువా ధరించి ప్లీనరీకి హాజరయ్యారు.