‘కారు..’ టాప్‌గేర్ | TRS party sucessful in elections 2014 | Sakshi
Sakshi News home page

‘కారు..’ టాప్‌గేర్

May 17 2014 3:14 AM | Updated on Oct 19 2018 7:27 PM

‘కారు..’ టాప్‌గేర్ - Sakshi

‘కారు..’ టాప్‌గేర్

సాధారణ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మహబూబ్‌నగర్ జిల్లా పట్టం కట్టింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు మరో ఏడు అసెంబ్లీ నియోజవకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధిం చారు.

నవ తెలంగాణ నిర్మాణంలో ‘గులాబీ’ వికసించాలని పాలమూరు ప్రజలు తీర్పునిచ్చారు. జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం కట్టబెట్టి జిల్లా ఆకాంక్షలు తీర్చమని కోరారు. పేదరికంతో మగ్గుతున్న జిల్లాను ప్రగతి పట్టాలపై నడిపించాలని ఓటింగు ద్వారా తమ మనోగతాన్ని స్పష్టీకరించారు.
 
 ఇక ‘హస్తా’నికి నాలుగుచోట్ల ఎమ్మెల్యే, ఒక పార్లమెంటు స్థానాల్లో  గెలిపించి రెండోస్థానంలో నిలబెట్టి రాష్ట్రం ఇచ్చిన కృతజ్ఞతను చూపించారు. మేము సైతం పోరాడామని చెప్పుకున్నందుకు ‘సైకిల్’కూ  రెండు చోట్ల అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపారు. ఇక కల్వకుర్తి ఫలితం నిలచి పోవడంతో అక్కడి ఓటర్ల మొగ్గు తేలలేదు. మొత్తానికి పరిణితి చెందిన జడ్జిమెంట్‌తో ఓటరంటే అసామాన్యుడని నిరూపించారు.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి మహబూబ్‌నగర్ జిల్లా పట్టం కట్టింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు మరో ఏడు అసెంబ్లీ నియోజవకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధిం చారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం తో పాటు మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పాగా వేశారు. 2009 ఎన్నికల్లో జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం ప్రస్తుతం రెండు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి 2590 స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఏపీ జితేందర్‌రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు.
 
 క్రాస్ ఓటింగ్‌పై భారీ ఆశలు పెట్టుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి నాగం జనార్దన్‌రెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంలో అనూహ్యంగా కాంగ్రస్ అభ్యర్థిగా రంగ ప్రవేశం చేసిన సీనియర్ పార్లమెంటేరియన్ నంది ఎల్లయ్య గెలుపు సాధించారు. వరుసగా మూడు పర్యాయాలు నాగర్‌కర్నూలు నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మంద జగన్నాధ్ చివరి రౌండ్లలో వెనుకబడి ఓటమి పాలయ్యారు. మహబూబ్‌నగర్‌లో టీజీఓ మాజీ అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ విజయం సాధించారు. షాద్‌నగర్‌లో అంజయ్య యాదవ్, జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అచ్చంపేట (ఎస్సీ) నియోజకవర్గంలో గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూలులో మర్రి జనార్దన్ రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా విజయం సాధించారు.
 
 గద్వాలలో డీకే అరుణ పాగా
 తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ దిగ్గజాలు ఓటమి పాలైనప్పటికీ గద్వాల నియోజకవర్గంలో మాత్రం మాజీ మంత్రి డీకే అరుణ వరుసగా మూడో సారి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన డీకే అరుణ మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చివరి వరకూ తీవ్ర పోటీ ఇచ్చారు. మక్తల్‌లో డీకే అరుణ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కూడా విజయం సాధించారు.
 
 వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి , అలంపూర్ (ఎస్సీ) నియోజకవర్గంలో సంపత్ కుమార్ గెలుపొందారు. కల్వకుర్తి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు 32 ఓట్ల స్వల్ప మెజారిటీ సాధించారు. అయితే వెల్దండ మండలం జూపల్లి పోలింగ్ కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మొరాయించడంతో ఓట్ల లెక్కింపు నిలిపివేసి ఫలితాన్ని ప్రకటించలేదు. ఎన్నికల కమిషన్ నిర్ణయం ఆధారంగా తిరిగి రీపోలింగ్ నిర్వహించే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు.
 
 రెండు స్థానాలకే పరిమితం
 బీజేపీతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానంతో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన తెలుగుదేశం నామమాత్ర ఫలితం సాధించింది. కొడంగల్, నారాయణపేట అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకుని మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంతో పాటు, మరో ఆరు అసెంబ్లీ స్తానాల్లో బరిలోకి దిగింది. కల్వకుర్తిలో బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఇచ్చారు. అయితే ఫలితం వెల్లడి నిలిచిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానంలోనూ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చినా ఓటమి పాలయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement