నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు  | TRS MLs Issued Notices to the High Court | Sakshi
Sakshi News home page

నలుగురు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు 

Apr 13 2019 4:57 AM | Updated on Apr 13 2019 4:58 AM

TRS MLs Issued Notices to the High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ శాసనమండలి పక్షంలో కాంగ్రెస్‌ మండలి పక్షం విలీనానికి సంబంధించి ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, ఆకుల లలిత, సంతోష్‌కుమార్, దామోదర్‌రెడ్డిలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. మండలి చైర్మన్, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులిచ్చింది. మొత్తం వ్యవహారంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్‌ శాసనమండలి పక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని కాంగ్రెస్‌కు చెందిన ఈ నలుగురు ఎమ్మెల్సీలు మండలి అప్పటి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు లేఖ ఇచ్చారు.

వెంటనే మండలి చైర్మన్‌ ఆ లేఖను ఆమోదించడంతో ఆ మేర బులెటిన్‌ జారీ అయింది. ఈ విలీన ప్రక్రియను సవాల్‌ చేస్తూ న్యాయవాదులు గిన్నె మల్లేశ్వరరావు, సి.బాలాజీలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఐ.మల్లికార్జున శర్మ వాదనలు వినిపిస్తూ.. విలీనాన్ని ఆమోదిస్తూ మండలి జారీచేసిన బులెటిన్‌ చట్ట విరుద్ధమైందిగా ప్రకటించాలని కోరారు. విలీనం సాకుతో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆ నలుగురు ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఆ నలుగురు కూడా అనర్హత వేటుకు అర్హులేనన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement