‘కాంగి’ రేస్‌

TRS MLA Candidates Announced KCR Medak - Sakshi

రాష్ట్ర శాసనసభ రద్దుతో పాటు, ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపు ఖరారు చేసింది. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో శుక్రవారం నాటి బహిరంగ సభతో కేసీఆర్‌ ప్రచార పర్వానికి కూడా శ్రీకారం చుట్టారు. దీంతో ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న పార్టీ నేతలు హైదరాబాద్‌లో మకాం వేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు ఏఐసీసీ పరిశీలకులను కలుస్తూ తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆశావహులు విజ్ఞప్తి చేస్తున్నారు. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ ఈ నెల 10న తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకోవడం ఖాయమైంది. ఈ నెల 12న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మానస సరోవర్‌ యాత్ర ముగించుకుని ఢిల్లీకి చేరిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీఆర్‌ఎస్‌ ప్రకటించడంతో ప్రధాన రాజకీయ పక్షం కాంగ్రెస్‌లోనూ టికెట్ల వేట ఊపందుకుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నేతలు రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత ఔత్సాహిక నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ పరిశీలకుడు బోస్‌రాజుతో భేటీ అయ్యారు. ఏకాభిప్రాయం కుదిరిన చోట మొదట అభ్యర్థులను ఖరారు చేస్తామని పార్టీ పరిశీలకులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నెల 12న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మానస సరోవర్‌ యాత్ర ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న తర్వాత తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

తొలి జాబితాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (అందోలు), మాజీ మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), గీతా రెడ్డి (జహీరాబాద్‌), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (సంగారెడ్డి) ఒంటేరు ప్రతాప్‌రెడ్డి (గజ్వేల్‌), ఆరేపల్లి మోహన్‌ (మానకొండూరు) పేర్లు ఉండే అవకాశముందని సమాచారం. ఒకరి కంటే ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన సెప్టెంబర్‌ చివరలో ఉండే అవకాశమున్నట్లు ఔత్సాహిక నేతలు పేర్కొంటున్నారు. టికె ట్లు, పొత్తుల కేటాయింపులకు సంబంధించి ఏర్పాటైన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఇప్పటికే ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులున్న చోట బలమైన ఇద్ద ్డరు లేదా ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితా ను ఇప్పటికే రూపొందించినట్లు తెలిసింది. 

10న కాంగ్రెస్‌ గూటికి నందీశ్వర్‌
పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే టి.నందీశ్వర్‌ గౌడ్‌ తిరిగి ఈ నెల 10న కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. 2009, 2014 ఎన్నికల్లో పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నందీశ్వర్‌ పోటీ చేయగా, 2014లో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో నందీశ్వర్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ను వీడి అమిత్‌షా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. కొంత కాలంగా తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అమీన్‌పూర్‌ మాజీ సర్పంచ్‌ కాటా శ్రీనివాస్‌గౌడ్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డి, గోదావరి అంజిరెడ్డి, పటాన్‌చెరు కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌ తదితరులు టికెట్‌ ఆశిస్తున్నారు. నందీశ్వర్‌ గౌడ్‌ చేరికతో పటాన్‌చెరు కాంగ్రెస్‌ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

టికెట్ల కోసం బహుముఖ పోటీ
∙దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేస్తారని భావించినా, ఈ సారికి ముత్యంరెడ్డి బరిలో ఉండాలని నిర్ణయించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన శ్రావణ్‌కుమార్‌రెడ్డిని తిరిగి మెదక్‌ ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేయించాలని ముత్యంరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలతో అటు ముత్యంరెడ్డి, ఇటు శ్రావణ్‌కుమార్‌ రెడ్డి ఇద్దరూ  పర్యటిస్తున్నారు.

∙హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి టికెట్‌ ఆశిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ శుక్రవారం హుస్నాబాద్‌లో ప్రచార సభ నిర్వహించడంతో ప్రవీణ్‌రెడ్డి నియోజకవర్గ పర్యటన ప్రారంభించారు. అభ్యర్థి ఖరారు కాకమునుపే ప్రవీణ్‌రెడ్డి ప్రచారం ప్రారంభించడంపై అభ్యంతరం తెలుపుతున్న శ్రీరాం చక్రవర్తి టీపీసీసీకి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

∙సిద్దిపేట నియోజకవర్గంలో తాడూరు శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్‌వర్మ, గంప మహేందర్‌ రావు, గూడూరు శ్రీనివాస్‌ తదితరులు టికెట్‌ ఆశిస్తున్నారు. శుక్రవారం టీపీసీసీ సమావేశానికి హాజరైన తాడూరు శ్రీనివాస్‌ గౌడ్‌ తనకు మరోమారు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు, ఇతర ముఖ్య నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. 2010 ఉప ఎన్నికలతో పాటు, 2014 ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా ఉన్న సమయంలో పోటీ చేసిన తనకు ప్రస్తుత పరిస్థితుల్లో మరోమారు టికెట్‌ ఇవ్వాలని కోరారు.

∙మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు, బట్టి జగపతి తదితరులు టికెట్లు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో విజయశాంతి రాకతో తనకు అవకాశం దక్కలేదని, కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

∙నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ కోసం మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌తో పాటు పీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి పోటీ పడుతున్నారు. 2016 ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తనకు మరోమారు అవకాశం ఇవ్వాల్సిందిగా శుక్రవారం జరిగిన పీసీసీ సమావేశం సందర్భంగా పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top