నల్లగొండ ఎంపీ స్థానానికి ఓ ముఖ్య నేత రాక?

TRS main leader contest in nalgonda mp seat - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ :  అధికార టీఆర్‌ఎస్‌ నాయకత్వం నల్లగొండపై పట్టు సాధించేందుకు పెద్ద కసరత్తే చేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాలు గెలుచుకుంది. కాగా, కాంగ్రెస్‌ ఐదు స్థానాలతోపాటు, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఒక స్థానం వెరసి ఆరు స్థానాలు గెలిచాయి. ఇందులో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్‌రావు, దేవరకొండనుంచి సీపీఐ తరఫున గెలిచిన రవీంద్రకుమార్‌.. టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీ బలం ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మందికి చేరింది.

 ఇక, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వంలో ప్రధాన పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు నల్లగొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఆ మాత్రం సీట్లు కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి. అయితే, ఈసారి అలాంటి ఫలితాలు రాకుండా నల్లగొండలో పూర్తిస్థాయిలో పాగా వేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రణాళికలు రచిస్తోంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నల్లగొండ కొత్త జిల్లా పరిధిలోని అన్ని స్థానాలను గెలుచుకునే వ్యూహానికి పదును పెడుతోంది. దీంతో ఆ పార్టీ  ఇప్పటినుంచే తమ చేతిలో లేని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలం పెంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

 ప్రధానంగా సీఎల్పీ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్, సీఎల్పీ ఉపనేత ఉన్న నల్లగొండ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిం చారని చెబుతున్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్, సీఎల్పీ డిప్యూటీ లీడర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచా రు. మరోవైపు సీఎల్పీ నేత జానారెడ్డి నాగార్జునసాగర్‌  నుంచి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలకు చెక్‌పెట్టేందుకు అ ధికార టీఆర్‌ఎస్‌ అధినేత పక్కా స్కెచ్‌ తయా రు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ..మూడు నియోజకవర్గాల్లో బలోపేతంపై దృష్టి
కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు ముఖ్య నేతలకు చెక్‌ పెట్టేందుకు వారి నియోజకవర్గాల్లో తమ బలంగా ఇంకా పెంచుకోవడమే లక్ష్యంగా వలసలను భారీగా ప్రోత్సహిస్తున్నారు. ఏ ఎన్నికల్లోనైనా కీలక పాత్ర పోషించే స్థానిక ప్రజాప్రతినిధులను కాంగ్రెస్‌నుంచి లాగేసుకుంటున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ నా యకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చని వలసలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల కింద నాగార్జునసాగర్‌ నియోజకర్గంలో జానారెడ్డికి దగ్గరి అనుచరులు అనదగిన వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యుల వంటి స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు వారి ముఖ్య అనుచరులను కూడా భారీగానే చేర్చుకోవడం ద్వారా బలం పెచుకుంటున్నారు.

నల్లగొండ ఎంపీ స్థానానికి ఓ ముఖ్యనేత రాక?
ఈసారి ఎన్నికల్లో నల్లగొండలో కాంగ్రెస్‌ను పూర్తిగా మట్టికరిపించేందుకు టీఆర్‌ఎస్‌ వేస్తున్న మరో ఎత్తుగడ నల్లగొండ లోక్‌సభా నియోజకవర్గం నుంచి పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత బరిలోకి దింపడమని చెబుతున్నారు. ఫలితంగా నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజ యం తేలికవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనే తక్కువ స్థానాలు గెలుచుకుంది.

ఈసారి అలా జరగకుండా మెజారిటీ స్థానాలు పొందేందుకు నల్లగొండ ఎంపీగా ఒక ముఖ్యనేతను బరిలోకి దింపడం ఖాయమంటున్నారు. ఉద్యమ సమయంలో కూడా బలహీనపడుతున్నామనుకున్న సందర్భాల్లో టీఆ ర్‌ఎస్‌ అధినేత నియోజకవర్గాలు మార్చి పోటీచేసిన ఉదంతాలను ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్‌ గతంలో కరీంనగర్, ఆ తర్వాత మహబూబ్‌నగర్, గత సార్వత్రిక ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడతోపాటు వాటి పరిధిలోని అసెంబ్లీ సీట్లలోనూ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచేలా చేశారు. ఈ సారి కూడా నల్లగొండ ఎంపీ సీటు నుంచి అదే తరహాలో ఒక ముఖ్య నేతను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top