దూకుడు పెంచిన టీఆర్‌ఎస్‌ నేతలు

TRS  Leaders Election Campaign In Nizamabad - Sakshi

అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలోనూ ముందుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో కనీసం నాలుగు బహిరంగ సభలను నిర్వహించనుంది. తద్వార పార్టీ శ్రేణులను సమాయత్తం చేయవచ్చని భావిస్తోంది.  రెండు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన ఎంపీ కవిత సభల నిర్వహణపై పార్టీ శ్రేణులతో మాట్లాడారు. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : అభ్యర్థులను ప్రకటించి ముందస్తు ఎన్నికలకు దూకుడుగా వెళుతు న్న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో కూడా అదే జోరు ను కొనసాగించాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్‌ రాకముందే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో కనీసం నాలుగు బహిరంగ సభలను నిర్వహించాలని భావిస్తోంది. ప్రతి రెండు నియోజకవర్గాలకు కలిపి ఒకటి చొప్పున అధినేత కేసీఆర్‌తో బహిరంగసభలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ శ్రేణులను ఎన్నికలకు మరింత సమాయత్తం చేయవచ్చని పార్టీ భావిస్తోంది.

మరోవైపు అన్ని పార్టీల కంటే ముందే టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం జోరందుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కేసీఆర్‌ జిల్లాలో తొలి బహిరంగ సభను నిజామాబాద్‌ నగరంలో నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఎంపీ కల్వకుంట్ల కవిత సభ నిర్వహణపై పార్టీ శ్రేణులతో మాట్లాడారు. నిజామాబాద్‌ అర్బన్‌తో, రూరల్‌ నియోజకవర్గాల నుంచి సుమా రు 60 వేల మంది పార్టీ శ్రేణులు, ప్రజలను తర లించాలని భావిస్తున్నారు. స్థానిక గిరిరాజ్‌ కళాశాల సమీపంలో ఉన్న మైదానంలో ఈ సభ జరగనుంది. బుధవారం ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మైదానాన్ని పరిశీలించారు. అలాగే బాజిరెడ్డితో కూడా ఎంపీ చర్చించినట్లు సమాచారం. ఈనెలాఖరులోపు సభ నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.
 
ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైతే.. 
ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంటే.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోందనే సంకేతాలను ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్‌కి సంబంధించి బోధన్, కామారెడ్డి నియోజకవర్గాల్లో అభ్యర్థులు మాత్రమే దాదాపు ఖరారయ్యారు. బీజేపీలో ఇంకా ఒక్క స్థానంపైన స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో తొమ్మిది నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ప్రచారం జోరందుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి టీ ఆర్‌ఎస్‌ అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం ప్రా రంభించారు. ఎన్నికల షెడ్యుల్‌ విడుదలకు ఇంకా కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు తమ రోజూవారీ ప్రచార షెడ్యూల్‌లో రెండు, మూ డు రోజులు విరామం ఇస్తున్నారు. ఈ సభల నిర్వహణ ద్వారా అభ్యర్థుల ప్రచారం నిర్విరామంగా కొనసాగుతుందని భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top