టికెట్‌ రాని ఆశావహుల చర్చోపచర్చలు

TRS Congress MLA Candidates Fighting For Tickets Khammam - Sakshi

ఇన్నాళ్లూ పార్టీకి సేవలు అందించారు. టికెట్‌ వస్తుందని కోటి ఆశలతో ఎదురుచూశారు. తీరొక్క ప్రయత్నాలు చేశారు. తమకు పరిచయం ఉన్న నేతల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. తీరా జాబితాలో పేరు లేకపోవడంతో ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. ఒకవైపు నామినేషన్‌ వేసేందుకు గడువు దగ్గరపడుతుండడంతో ఏం చేద్దాం.. ఎట్ల చేద్దాం.. అంటూ కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన నేతలంతా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు. కొందరైతే రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సాక్షి, ఖమ్మం​: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ వేసేందుకు సమయం ముంచుకొస్తుండగా.. జిల్లాలో రాజకీయం రంగులు మారుతోంది. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలంతా మరోదారి చూసుకునేందుకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకునే పనిలో నిమగ్నమయ్యారు. వైరా నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన రాములునాయక్‌ వైరాలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. అభిమానులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేస్తున్నఅభ్యర్థి మదన్‌లాల్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ అసంతృప్తివాదులు సైతం హాజరుకావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

రాములునాయక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల బరిలో ఉంచాలని ఏకాభిప్రాయానికి వచ్చిన సమావేశం.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమా? ఏదైనా జాతీయ పార్టీ గుర్తుతో బరిలో నిలవడమా? అనే అంశంపై చర్చించారు. బీఎస్పీ నుంచి పోటీ చేయడం వల్ల జాతీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు ఉంటుందని, ప్రజలకు తెలిసిన గుర్తు ఏనుగు కేటాయించే అవకాశం లభించడంతో విజయావకాశాలు మరింత మెరుగుపడతాయని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ను వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ శ్రేణులు కొందరు తాము రాములునాయక్‌కు పూర్తిస్థాయి అండదండలు అందిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

వైరాలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో రాములునాయక్‌కు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగేది లేదని.. ఆయన గెలుపునకు కృషి చేయాలని ప్రమాణం చేసినట్లు కూడా తెలుస్తోంది. దీంతో రాములునాయక్‌ ఈనెల 19వ తేదీన వైరా అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. బీఎస్పీ నుంచి టికెట్‌ తెచ్చుకోవడమా? స్వతంత్రుడిగా కొనసాగడమా? అనే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి రావాలని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వైరా నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పలువురు, టీఆర్‌ఎస్‌ అసంతృప్తివాదులు కొందరు హాజరుకావడంతో సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
 
ఖమ్మంలోనూ.. 
ఖమ్మం నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి గా రంగంలోకి దిగిన టీడీపీ నేత నామా నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌ నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగుతారని ప్రచారం జరిగిన మానుకొండ రాధాకిషోర్‌ను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. తనకు సహకరించాల్సిందిగా కోరగా.. పార్టీ శ్రేణులు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరితో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు సమాచారం. ఇక రాధాకిషోర్, అలాగే మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఈనెల 19న నామినేషన్‌ వేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పోట్లసైతం తన అనుచరవర్గంతో సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాత్రం కూటమిలో అసంతృప్తులు.. తిరుగుబాట్లు టీ కప్పులో తుపాను వంటివని, అన్నీ త్వరలోనే సర్దుకుంటాయని.. ఇందుకు కాంగ్రెస్‌ పెద్దన్న పాత్ర పోషిస్తుందని శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భరోసా వ్యక్తం చేశారు. ఇక సత్తుపల్లి ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య శనివారం నామినేషన్‌ వేయనున్నారు. అలాగే వైరా నుంచి కాంగ్రెస్‌నేత రాములునాయక్‌ను స్వతంత్ర అభ్యర్థి లేదా బీఎస్పీ తరఫున బరిలోకి దించేందు కు జరుగుతున్న ముమ్మర ప్రయత్నాలపై నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో కొంత అలజడి రేపింది.

రాములునాయక్‌కు మద్దతు ప్రకటించే నేతలను సముదాయించేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేకంగా సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా ఒకరిని రంగంలోకి దించాలనే అంశంపై ప్రజాకూటమిలో భాగస్వామ్య పక్షమైన సీపీఐ సైతం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీకి సహకరించేలా చూడాలని సీపీఐ నేతలు కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కందాళ ఉపేందర్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ వేశారు.

వైరాలో రాములునాయక్‌కు మద్దతుగా ప్రమాణం చేస్తున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అసమ్మతి నాయకులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top