గిరిజన వర్సిటీ ప్రవేశాలు లేనట్లే!

Tribal university is not even available this year - Sakshi

నిర్వహణ బాధ్యతలు తీసుకుని మౌనంగా ఉన్న హెచ్‌సీయూ

హెచ్‌సీయూలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల

గిరిజన వర్సిటీలో ప్రవేశాలను ప్రస్తావించని వైనం

ఈ ఏడాది కూడా అందుబాటులోకి రావడం కష్టమే

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన యూనివర్సిటీ ఈ ఏడాది కూడా అందుబాటులోకి వచ్చేలా లేదు. వాస్తవానికి 2019–20 విద్యా సంవత్సరం నుంచి మహబూబాబాద్‌ జిల్లాలో ఈ వర్సిటీని ప్రారంభించాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈమేరకు చర్యలు చేపట్టాలని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సూచనలు సైతం చేశారు. నిర్దేశిత యూజీ, పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు చేపట్టాలి. ఈక్రమంలో హెచ్‌సీయూ ద్వారా విడుదలయ్యే నోటిఫికేషన్‌ ద్వారా గిరిజన యూనివర్సిటీ ప్రవేశాలు జరుగుతాయని భావించారు. ఇటీవల హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పలు పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. కానీ ఇందులో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. 

స్థలం కేటాయింపు... భవనాల అప్పగింత 
గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 483 ఎకరాల భూమిని కేటాయించగా, ఇప్పటికే మెజార్టీ భూమిని రెవెన్యూ అధికారులు గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించారు. తక్షణమే తరగతులు నిర్వహించుకునేందుకు వీలుగా యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ కోసం కేటాయించిన భవనాన్ని వర్సిటీకి గిరిజన సంక్షేమ శాఖ అప్పగించింది. దీంతో ఇప్పటికిప్పుడు తరగతులు మొదలుపెట్టే వీలుంది. అయితే డిగ్రీ, పీజీ కేటగిరీల్లో నిర్దేశిత కోర్సుల్లో ప్రవేశాలు, బోధన తదితర బాధ్యతలన్నీ ప్రభుత్వం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి అప్పగించింది. అయితే, ఇప్పటికీ గిరిజన వర్సిటీ ఊసే ఎక్కడా కనిపించడం లేదు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇటీవల తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు నోటిఫికేషన్లు జారీ చేయగా, చాలావాటికి దరఖాస్తుల స్వీకరణ గడువు సైతం ముంచుకొస్తోంది. గిరిజన యూనివర్సిటీ ప్రవేశ బాధ్యతలు ప్రభుత్వం హెచ్‌సీయూకు అప్పగించిన నేపథ్యంలో హెచ్‌సీయూ నోటిఫికేషన్‌ ద్వారా ప్రవేశాలు జరుగుతాయని అంతా భావించారు. ఇటీవల హెచ్‌సీయూ నోటిఫికేషన్‌లో గిరిజన వర్సిటీ ప్రవేశాల సమాచారం లేకపోవడంతో ఈ ఏడాది కూడా గిరిజన వర్సిటీ అందుబాటులోకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆరు కోర్సులకు  అవకాశం ఉన్నా... 
2019–20 విద్యా సంవత్సరంలో గిరిజన యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే తొలుత ఆరు కోర్సులను ప్రారంభించాలి. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులున్నాయి. డిగ్రీలో బీఏ (హోటల్‌ మేనేజ్‌మెంట్‌), బీసీఏ, బీబీఏ, పీజీ కేటగిరీలో ఎంసీఏ, ఎంబీఏ (మార్కెటింగ్, ప్యాకేజింగ్‌), ఎంఏ (గిరిజన సంస్కృతి, జానపద కళలు) కోర్సులను ప్రారంభిస్తారు. మరిన్ని పీజీ, పీహెచ్‌డీ కోర్సులను దశలవారీగా అందుబాటులోకి తెస్తారు. తొలిఏడాది ప్రారం భించే కోర్సుల్లో మొత్తంగా 180 మందికి ప్రవేశా లు కల్పిస్తారు. ఏటా తరగతులు పెరుగుతూ, కొత్త కోర్సుల్లో ప్రవేశాలతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. గిరిజనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కావడంతో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశాల్లో 30 శాతం సీట్లు వారికి కేటాయించనుంది. కానీ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లే విడుదల కాకపోవడంతో గందరగోళం నెలకొంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top