
హెచ్‌సీయూలోని తులసీ థెరప్యూటిక్స్ స్టార్టప్ ఘనత
మార్పిడి అవసరం లేకుండా మళ్లీ పెరిగేలా ప్రయోగం
జంతువుల్లో ప్రీక్లినికల్ ట్రయల్స్ విజయవంతం.. త్వరలో మానవ ప్రయోగాలు
దేశంలో 25 లక్షల మందిని పరీక్షించగా 65 శాతం మంది ఫ్యాటీ లివర్ బాధితులే..
సాక్షి, హైదరాబాద్: ఫ్యాటీ లివర్, లివర్ ఫెయిల్యూర్ వంటివాటి గురించి తరచూ వింటూంటాం. జీవనశైలి మార్పు వంటి కారణాలతో మన కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. రక్తశుద్ధి, ప్రొటీన్, హార్మోన్ల ఉత్పత్తి, జీవక్రియల నియంత్రణ, రోగనిరోధక వ్యవస్థకు ఊతమివ్వడంలో కాలేయం కీలకం. అయితే, కాలేయ సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో ఓ స్టార్టప్ కంపెనీ ముందడుగు వేసింది. మూలకణాలు, ఎక్సోసోమ్‌లను ఉపయోగించి పాడైపోయిన జంతు కాలేయాన్ని మళ్లీ పెరిగేలా చేయడంలో ‘తులసీ థెరప్యూటిక్స్’ అనే సంస్థ విజయం సాధించింది. ప్రస్తుతం కాలేయం బాగా పాడైతే ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప మరో మార్గం లేదు. ఈ సంస్థ చేస్తున్న ప్రయోగాలు పూర్తిస్థాయిలో విజయవంతమైతే అలాంటి సమస్య ఉత్పన్నం కాదు. పాడైన కాలేయాన్ని మార్చకుండా పునరుజ్జీవింపచేయొచ్చు
ప్రీక్లినికల్ ట్రయల్స్ విజయవంతం
హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో స్టార్టప్‌ల ప్రోత్సాహానికి ఆస్పైర్–బయో నెస్ట్ అనే విభాగం ఉంది. కాలేయం పనిచేయని స్థితిలో ఉంటే బాగుచేయడం ఎలా అన్న దానిపై తులసీ థెరప్యూటిక్స్ ఏళ్లుగా పరిశోధనలు చేస్తోంది. ఇందులోభాగంగా కంపెనీ శాస్త్రవేత్తలు ‘తులసీ–28ఎక్స్’ అనే ఒక మందును తయారు చేశారు. ఇందులో బొడ్డుతాడు జిగురులో ఉండే మూలకణాలతో తయారైంది. దీన్ని మెసెన్‌కైమల్ స్టెమ్‌సెల్స్ అంటారు. వీటికి బొడ్డుతాడులోనే లభించే ఎక్సోసోమ్‌లు (శరీర కణాల మధ్య మెసెంజర్‌లాంటివి) కూడా చేర్చి ప్రయోగాలు చేపట్టారు.
అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ చలసాని నాగ, చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ డాక్టర్ అజయ్ దుసేజాల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రయోగం విజయం సాధించింది. తులసీ–28ఎక్స్ అందుకున్న జంతు కాలేయాలన్నీ మళ్లీ పెరగడం మొదలైంది. ఏ ఒక్క జంతువూ మరణించలేదు. ఇదే సమయంలో తులసీ–28ఎక్స్ అందుకోని జంతువుల కాలేయాల్లో 14 శాతం పెరుగుదల కనిపించిందని, 43 శాతం జంతువులు మరణించాయని తులసీ థెరప్యూటిక్స్ వ్యవస్థాపకులు, సీఈవో డాక్టర్ అట్లూరి సాయిరామ్ తెలిపారు.
భారతీయ బయోటెక్ రంగంలో ఇదో మైలు రాయి లాంటిదని వ్యాఖ్యానించారు. జంతు కాలేయాల్లో ప్రీక్లినికల్ ట్రయల్స్ విజయవంతమైన నేపథ్యంలో మానవ ప్రయోగాలు సవాలుగా ఉన్నాయన్నారు. ఈ పరిశోధన కాలేయ సంబంధిత వ్యాధుల చికిత్సలో కొత్త అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ రీజనరేటివ్ మెడిసిన్‌లో ప్రచురణకు అర్హత సాధించడం విశేషం.
25 లక్షల మందికి పరీక్షలు
దేశంలో ఏటా లక్షల మంది కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సంస్థ దేశంలో 25 లక్షల మందికి పరీక్షలు జరపగా 65% మందికి వ్యాధి ఉన్నట్టు తేలింది. వీరిలో 85%మంది మంది మద్యపానానికి బానిసలైన వారు. దేశంలో ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో ఉన్నారు. ఊబకాయులు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువ. ఐటీ రంగంలో పనిచేస్తున్న వారిలో అత్యధికులు కాలేయ వ్యాధుల బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
‘నిమ్స్’తో కలిసి మానవ ప్రయోగాలు
మూలకణాలకు ఎక్సోసోమ్‌లను జోడించి కాలేయ వ్యాధికి ఉపయోగించింది తులసీ థెరప్యూటిక్స్ సంస్థ ఒక్కటే. మాకు తెలిసినంత వరకూ ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం చేసిన బయోటెక్ కంపెనీ ఇంకోటి లేదు. ‘నిమ్స్’ సాయంతో తులసీ–28ఎక్స్‌తో మానవ ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం కాలేయం బాగా పాడైతే మార్చడం మినహా మరో మార్గం లేదు. మా ప్రయోగాలు విజయవంతమైతే ఈ సమస్య రాదు. –డాక్టర్ బొంతల రవి, తులసీ థెరప్యూటిక్స్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్