ఆర్టీసీలో కీలక అధికారుల బదిలీ జరిగింది. ఇటీవలే ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న సోమారపు సత్యనారాయణ బదిలీలపై కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆర్టీసీ జేఎండీ రమణారావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కీలక అధికారుల బదిలీ జరిగింది. ఇటీవలే ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న సోమారపు సత్యనారాయణ బదిలీలపై కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆర్టీసీ జేఎండీ రమణారావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అస్తవ్యస్తంగా మారిన ఆర్టీసీని వెంటనే గాడిలో పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో తొలి చర్యలో భాగంగా సత్యనారాయణ బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఆర్టీసీలో అత్యంత కీలకమైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్– ఆపరేషన్స్ పోస్టును ప్రస్తుతం హైదరాబాద్ జోన్ ఈడీగా ఉన్న నాగరాజుకు అప్పగించారు. ఇంతకాలం ఈ పోస్టును జేఎండీ రమణారావు తన వద్దే ఉంచుకున్నారు.
అలాగే ఈడీ–అడ్మిన్ బాధ్యతను కూడా నాగరాజుకే అప్పగించారు. ఆయన బదిలీతో ఖాళీ అయిన హైదరాబాద్ జోన్ ఈడీ పోస్టును ఇప్పటివరకు మెదక్ ఆర్‌ఎంగా ఉన్న వేణుకు పదోన్నతి కల్పించి అప్పగించారు. మెదక్ ఆర్‌ఎంగా ప్రస్తుతం బస్ భవన్‌లో డిప్యూటీ సీఎంఈ పోస్టులో ఉన్న రఘునాథరావును నియమించారు. డిప్యూటీ సీటీఎంగా ఉన్న ఖుష్రుఖాన్‌ను నిజామాబాద్ ఆర్‌ఎంగా బదిలీ చేశారు. నిజామాబాద్ ఆర్‌ఎంగా ఉన్న రమాకాంత్‌ను చార్మినార్ ఆర్‌ఎంగా బదిలీ చేశారు. వరంగల్ ఆర్‌ఎంగా ఉన్న యాదగిరిని హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఆర్‌ఎంగా నియమించారు. బస్‌భవన్‌లో ఈడీ (ఎ) విభాగంలో ఓఎస్డీగా ఉన్న ఎం.వెంకటేశ్వర్‌రావును వరంగల్ ఆర్‌ఎంగా నియమించారు. వీటితోపాటు డిపో మేనేజర్లు, బస్‌భవన్‌లోని పలు పోస్టులకు సంబంధించి మరో 30 బదిలీలు కూడా చేశారు.