నేటి నుంచి  యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు 

From today yadadri annual Brahmotsavam - Sakshi

10 నుంచి అలంకార సేవలు ప్రారంభం 

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 18 వరకు జరగనున్నాయి. 11 రోజులపాటు జరిగే ఆ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు. సుమారు 40 మంది రుత్విక్కులకు ఆహ్వానాలు పంపారు. ఆలయంలో హోమగుండం సిద్ధం చేసి ఉంచారు. భక్తుల కోసం ఎండ వేడిమి తగలకుండా చలువ పందిళ్లువేశారు. స్వామివారి కల్యాణం జరిగే హైస్కూల్‌ మైదానాన్ని ఉన్నతాధికారులు సందర్శించి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 8న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసి, స్వస్తివాచనం, రక్షా బంధనం చేస్తారు. 9వ తేదీ దేవతాహ్వానం పలుకుతారు. 

10 నుంచి అలంకార సేవలు ప్రారంభం.. 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 10 నుంచి 16 వరకు వారం రోజులపాటు అలంకార, వాహనసేవలు జరగనున్నాయి. 10వ తేదీ ఉదయం మత్య్సావతారం అలంకార సేవ, రాత్రి 9 గంటలకు శేష వాహనసేవ, 11న ఉదయం 11 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ, రాత్రి 9 గంటలకు హంస వాహనసేవ, 12వ తేదీ ఉదయం 11 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 9 గంటలకు పోన్న వాహన సేవ ఉంటుంది. 13న ఉదయం 11 గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ, 14న ఉదయం 11 గంటలకు జగన్మోహినీ అలంకారం సేవ, రాత్రి 9 గంటలకు అశ్వవాహన సేవ, 15న ఉదయం 11 గంటలకు గజవాహన సేవ, రాత్రి 9 గంటలకు స్వామివారి కల్యాణం, 16వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ మహావిష్ణు అలంకారం సేవ, రాత్రి స్వామివారి దివ్యవిమాన రథోత్సవం ఉంటుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top