ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.
కరీంనగర్, న్యూస్‌లైన్ : ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణ ప్రజల మనోభావాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నందున అన్ని వర్గాలప్రజలు బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కోరారు. పోలవరం ముంపు ప్రాంతంలోని మండలాల విలీనం ముమ్మాటికి కవ్వింపు చర్యేనని పేర్కొన్నారు.
చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు రాజకీయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం తెలంగాణ ప్రజలను దగా చేయడమేనని అన్నారు. బంద్‌లో వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలతోపాటు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బంద్‌ను జయప్రదం చేయాలని టీఆర్‌ఎస్ నాయకులు వెలిచాల రాజేందర్ ఒక ప్రకటనలో కోరారు.
సీపీఐ మద్దతు
ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గురువారం నిర్వహించనున్న తెలంగాణ బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. నారాయణ తెలిపారు. బంద్‌లో సీపీఐ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పంచాయతీరాజ్ మినిస్టీరియల్
ఉద్యోగుల మద్దతు
తెలంగాణ బంద్‌కు తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జనగామ నాగరాజు, ఎ.సత్యనారాయణరెడ్డి మద్దతు ప్రకటించారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వివిధ సంఘాల మద్దతు
టవర్‌సర్కిల్ : తెలంగాణ బంద్‌కు పీఆర్టీయూ మద్దతు తెలుపుతున్నట్లు ఆ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జాలి మహేందర్‌రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఫయాజ్‌అలీ, ఉపాధ్యక్షుడు రామన్‌నాయక్ కూడా మద్దతు ప్రకటించారు. తెలంగాణ బంద్‌కు టీయూడబ్ల్యూజే సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షడు గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి తాడూరి కరుణాకర్, రవీందర్, ప్రభుదాస్, ప్రవీణ్‌కుమార్, ఎన్‌ఎస్ రావు తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎన్డీయే తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఎం మద్దతు
తెలంగాణ బంద్‌కు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి తెలిపారు. కేంద్రం ఆమోదించిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.