బోధన వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు | Sakshi
Sakshi News home page

బోధన వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు

Published Thu, Jun 20 2019 2:33 AM

Timely promotions for teaching doctors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు శుభవార్త. వారికి ఇక నుంచి నిర్ణీతకాలంలో పదోన్నతులు లభిస్తాయి. దీనికి సంబంధించి సవరణ ఉత్తర్వులను వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం జారీ చేశారు. వాస్తవంగా గతేడాదే ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా.. సాంకేతిక కారణాల వల్ల అది అమలుకాలేదు. ఆ తర్వాత వరుసగా ఎన్నికలు రావడంతో ఇప్పటివరకు ఆ ఉత్తర్వులు సవరణకు నోచుకోలేదు. సవరణలు కోరుతూ వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం (సీఏఎస్‌) కింద దీన్ని అమలు చేస్తారు.

2006 నవంబర్‌ 1 నుంచి దీన్ని అమలు చేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అప్పటినుంచి సర్వీసును మాత్రమే లెక్కలోకి తీసుకుంటామని, అయితే ఆర్థికపరంగా ఎలాంటి ప్రయోజనం కల్పించబోమని స్పష్టం చేశారు. కేవలం గతేడాది ఉత్తర్వులు విడుదలైన తేదీ అంటే సెప్టెంబర్‌ 5 నుంచి మాత్రమే ఆర్థికపరమైన ప్రయోజనాలు అందుతాయి. 2006 నుంచి అమలు చేయడమంటే అప్పటినుంచి సర్వీసులో ఉన్న బోధనా వైద్యులకు పదోన్నతులు మాత్రం అమల్లోకి వస్తాయన్నమాట. తాజా నిర్ణయం ప్రకారం బోధనాసుపత్రుల్లో పనిచేసే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల సర్వీసు నాలుగేళ్లు నిండితే యథావిధిగా వారికి అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. అలాగే అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఆరేళ్లు సర్వీసు నిండితే యథావిధిగా వారికి ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. మరోవైపు అసోసియేట్‌ ప్రొఫెసర్లకు మూడేళ్లు నిండాక వారికి స్కేల్‌లో మార్పు తీసుకొస్తారు. అంటే వారికి మధ్యలో ఒక ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు.  

పదోన్నతుల కోసం ఎదురుచూపు.. 
ప్రస్తుతం పదోన్నతులు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైర్‌ అయ్యాకే పదోన్నతులు లభిస్తున్నాయి. దీనివల్ల ఖాళీలు కొన్నే ఉంటే కొందరికి అవకాశమున్నా మరికొందరికి పదోన్నతులు లభించవు. ఒక్కోసారి పదేళ్లకు, 15 ఏళ్లకు పదోన్నతులు వచ్చినవారు కూడా ఉన్నారు. మరికొందరికైతే 20 ఏళ్లకు గాని పదోన్నతి వచ్చిన పరిస్థితి లేదు. ఇది వైద్యుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలుచేస్తున్నాయి. తాజా నిర్ణయంతో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది వైద్యులకు ప్రయోజనం కలుగనుందని సమాచారం. అంతేకాదు వారికి పదోన్నతి వచ్చిన ప్రతీసారి కూడా స్కేల్స్‌లోనూ మార్పులుంటాయి. అంటే ఆర్థికంగా వారికి మరింత ప్రయోజనం కలగనుంది.  

65 ఏళ్ల విరమణపై ఆర్డినెన్స్‌కు కసరత్తు.. 
బోధనా వైద్యులకు విరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలన్న సర్కారు నిర్ణయం అమలుకు సంబంధించి శరవేగంగా ఆర్డినెన్స్‌ జారీచేసే పని జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో ఆర్డినెన్స్‌ వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. కొందరైతే దీనికి సంబంధించి గవర్నర్‌ వద్దకు ఆర్డినెన్స్‌ ఫైలు వెళ్లిందని చెబుతున్నారు.  అయితే అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు పొక్కడంలేదు.  విరమణ వయసు పెంపును వ్యతిరేకిస్తూ ఇప్పటికే  జూడాలు,  కొందరు డాక్టర్లు, ప్రభుత్వ వైద్యుల సంఘాల్లో కొన్ని ఇప్పటికే నిరసనలు చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో సర్కారు ఆర్డినెన్స్‌ తెస్తుందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి.   

మార్పు హోదాలోనే.. పనిలో కాదు
ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతులు లేకపోయినా మధ్యమధ్యలో స్కేల్స్‌లోనూ నిర్ణీత సమయం ప్రకారం మార్పులు జరుగుతుంటాయి. ఇక వైద్యులకు ఖాళీలు లేకపోయినా నిర్ణీత కాలంలో పదోన్నతులు ఇవ్వడం వల్ల ఒక్కోసారి వారి హోదా మారుతుందే కానీ పనిలో మార్పు ఉండదు. ఖాళీలు ఏర్పడ్డాకే వారు భౌతికంగా ఇతర పోస్టులకు మారతారు. అంటే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఖాళీలు లేకపోయినా నాలుగేళ్లకు అసోసియేట్‌గా పదోన్నతి లభిస్తే, అతను అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానే విధులు నిర్వహిస్తారు. అక్కడ ఖాళీ ఏర్పడితేనే అతని విధులు మారుతాయి.

Advertisement
Advertisement