ఎంబీబీఎస్ చేరికల్లో 60.72 శాతం సీట్లు అమ్మాయిల కైవసం
గడచిన రెండేళ్లతో పోలిస్తే 3.66 శాతం అధికం
చంద్రబాబు నిర్ణయాలతో రెండేళ్లలో 2,450 సీట్లు కోల్పోయిన విద్యార్థులు
ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమై.. సీట్లు సమకూరి ఉంటే మరింత మందికి అవకాశం
సాక్షి, అమరావతి: ఈ ఏడాది (2025–26) ఎంబీబీఎస్ ప్రవేశాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. సాధారణంగా ఎంబీబీఎస్ ప్రవేశాల్లో అమ్మాయిలదే పైచేయి ఉంటుంది. కాగా.. గడచిన రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది అధికంగా 3.66 శాతం సీట్లు ఎక్కువగా అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 6,432 సీట్లున్నాయి. వీటిలో 60.72 శాతం సీట్లు అమ్మాయిలే దక్కించుకున్నారు. అబ్బాయిలు 39.28 శాతం సీట్లకే పరిమితమయ్యారు.
సీట్ల కేటాయింపు సరళిపై శనివారం వైద్యశాఖ ప్రకటన విడుదల చేసింది. 2023–24లో 57.06 శాతం, 2024–25లో 57.96 శాతం చొప్పున అమ్మాయిలు సీట్లు దక్కించుకున్నట్టు తెలిపింది. 2025–26 విద్యా సంవత్సరంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 6,430 ఉండగా.. వీటిలో కన్వీనర్ కోటా కింద అమ్మాయిలు 2,617, అబ్బాయిలు 1,638 చొప్పున సీట్లు దక్కించుకున్నారు. యాజమాన్య కోటాలో అమ్మాయిలు 1,287, అబ్బాయిలు 888 మంది చొప్పున ప్రవేశాలు పొందారు.
కొత్త కళాశాలలు ప్రారంభమై ఉంటే..
వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం తరగతుల్ని ప్రారంభించకుండా చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడింది. గత ప్రభుత్వంలో 17 కళాశాలలకు శ్రీకారం చుట్టగా.. 6 వైద్య కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన కళాశాలలు 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో అందుబాటులోకి రావాల్సి ఉంది.
అయితే, గతేడాది పులివెందుల వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వమే వద్దని లేఖలు రాసి రద్దు చేయించింది. దీంతో మరో 3 కళాశాలలు ప్రారంభం కాకుండా అడ్డుపడింది. ఈ చర్యల కారణంగా గతేడాది 700 సీట్లను మన విద్యార్థులు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు.
7 వైద్య కళాశాలలు 2025–26లో అందుబాటులోకి రావాల్సి ఉండగా.. ఒక్క కళాశాలకు కూడా అనుమతుల కోసం ప్రభుత్వం దరఖాస్తు చేయలేదు. ఈ 7 కళాశాలల ద్వారా 1,050 సీట్లు సమకూరాల్సి ఉండగా.. ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఇలా 2024–25 విద్యా సంవత్సరంలో 700, 2025–26లో 1,750 సీట్ల చొప్పున 2,450 మంది విద్యార్థులు వైద్య విద్యకు దూరం కాగా.. వారి భవిష్యత్ తలకిందులైంది. ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలల్ని యథావిధిగా ప్రారంభించి ఉంటే మన ఆడ బిడ్డలకు మరింత మేలు జరిగి ఉండేదని రాష్ట్రవ్యాప్త చర్చ సాగుతోంది.


