రంగారెడ్డిలో ఫలితంపై ఉత్కంఠ

 The Thrill Is On The Public Domain. - Sakshi

పోలింగ్‌ సరళిపై విశ్లేషణలు 

లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులు 

గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. 

పల్లెల్లో టీఆర్‌ఎస్‌కు ఆదరణ!

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రజాతీర్పుపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ ప్రక్రియ ముగియడమే తరువాయి.. వెలువరించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు అభ్యర్థుల గుండెల్లో దడను పెంచాయి. పోలింగ్‌ సరళిని బట్టి ఫలితాలను విశ్లేషిస్తున్న రాజకీయ పరిశీలకులు.. ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపారనే దానిపై భిన్న వాదనలు వినిపించారు. జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రజానాడి అంతుచిక్కకపోయినా అభ్యర్థులు మాత్రం గెలుపుమాదేననే ధీమాతో ఉన్నారు. పోలింగ్‌బూత్‌ల వారీగా నమోదైన ఓటింగ్‌ శాతాన్ని విశ్లేషించుకుంటున్న అభ్యర్థులు కూడికలు, తీసివేతలు చేస్తున్నారు. పార్టీవర్గాల నుంచి సేకరించిన సమాచారంతో మదింపు చేస్తున్నారు. ఏయే వర్గాలు పార్టీకి అండగా నిలిచాయి, ఎవరు వెన్నుపోటు పోడిచారనేదానిపైనా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఐదు గంటలకు పోలింగ్‌ ముగియడమే తరువాయి.. పార్టీ ఏజెంట్లను సంప్రదించిన ముఖ్యనేతలు పోలింగ్‌ పూర్తి చేసుకొని చేవెళ్ల ప్రభుత్వ  కళాశాలకు ఈవీఎంలతో చేరుకున్న సిబ్బంది uమొదటి పేజీ తరువాయి పోలింగ్‌ స్టేషన్ల వారీగా దక్కే ఓట్లపై అంచనాలు వేశారు. అభ్యర్థుల లెక్కలు ఇలా ఉండగా.. ఎగ్జిట్‌ పోల్స్‌ మాత్రం పార్టీలకు కునుకులేకుండా చేశాయి. గెలిచేదెవరిదానిపై తలోరకంగా సర్వే ఫలితాలు ఇవ్వడం కలవరపడేలా చేసింది.  

నువ్వా నేనా! 
కొడంగల్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫలితం కూడా దాదాపుగా అలాగే ఉండబోతోంది. ఇక తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి తొలిసారి చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. చావో రేవో తేల్చుకోవాలని బరిలో దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌రెడ్డితో మహేందర్‌కు ముచ్చెమటలు పట్టాయి. తాండూరులోనూ ఇరుపార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. అదృష్టం ఎవరిని వరించినా.. స్వల్ప ఓట్ల తేడాతోనే గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది. పరిగిలో తాజా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేశ్‌రెడ్డి నుంచి గట్టిపోటీ ఎదురైంది. చేవెళ్లలోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య రసవత్తర పోరు జరిగింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలె యాదయ్యదే పైచేయిగా కనిపిస్తోంది. వికారాబాద్‌లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, స్వతంత్ర అభ్యర్థుల నడుమ ముక్కోణపు పోటీ జరిగినా.. తుది పోరులో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులే రంగంలో నిలిచినట్లు తెలుస్తోంది. షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్, బీఎస్పీ మధ్య పోటీ ఉత్కంఠను తలపిస్తోంది. షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం, టీడీపీలు గట్టి పోటీనిచ్చాయి. టీడీపీ, టీఆర్‌ఎస్‌లు భారీగా ఓట్లను చీల్చుకుంటే మజ్లిస్‌ బయటపడ్డా ఆశ్చర్యం లేదు. ఇక ఎల్‌బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కొంత అనుకూల పవనాలు వీచినట్లు పొలింగ్‌ సరళిని బట్టి తెలుస్తోంది. కల్వకుర్తిలో త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నడుమ ఢీ అంటే ఢీ అనే రీతిలో సమరం సాగడం.. 84శాతం పోలింగ్‌ నమోదు కావడంతో అనూహ్య ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

గ్రామాల్లో ‘కారు’ దౌడ్‌
గ్రామీణ ఓటర్లు మరోసారి గులాబీ పార్టీకి మద్దతు పలికినట్లు పోలింగ్‌ సరళిని బట్టి స్పష్టమవుతోంది. ముఖ్యంగా రైతులు, వృద్ధులు, మైనార్టీలు టీఆర్‌ఎస్‌ను ఆదరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పరిగి, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల, తాండూరు, కల్వకుర్తిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ గణనీయ ఓట్లు సాధించినట్లు ఆయా వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత టీఆర్‌ఎస్‌ పనితీరుపై పెదవివిరిచారు. దీని ప్రభావం 11న వెలువడే ఎన్నికల ఫలితాల్లో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top