ఒక్క కారు ఎంత పని చేసిందో.. | Three hours Traffic Jam On Begumpet Flyover Bridge Hyderabad | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ ‘జామ్‌’జాటం!

Aug 14 2018 9:28 AM | Updated on Sep 4 2018 5:53 PM

Three hours Traffic Jam On Begumpet Flyover Bridge Hyderabad - Sakshi

సికింద్రాబాద్‌–బేగంపేట–పంజగుట్ట మార్గంలో నిలిచిపోయిన ట్రాఫిక్‌ , డివైడర్‌ ఎక్కిన కారు...

అసలే బేగంపేట్‌– పంజగుట్ట మార్గం.. ఆపై పీక్‌ అవర్స్‌.. ఇంకేముంది వాహనదారులు చుక్కలు చూశారు. సోమవారం ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతో బేగంపేట్‌ ఫ్లైఓవర్‌పై కారు డివైడర్‌ను ఢీకొట్టి.. దాని మధ్యలో ఆగిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. దాదాపు మూడు గంటలైనా పరిస్థితి అదుపులోకి రాలేదు.

సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్‌: ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వేల మందిని ఇబ్బందుల పాలు చేసింది. అతడి కారు ఫ్లైఓవర్‌పై డివైడర్‌ ఎక్కడంతో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బేగంపేటలో సోమవారం ఉదయం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి ట్రాఫిక్‌ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. పోలీసులు సదరు వాహనచోదకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత నెల 18న చోటు చేసుకున్న ‘జీహెచ్‌ఎంసీ లారీ బ్రేక్‌డౌన్‌ పరేషాన్‌’ను పూర్తిగా మరువక ముందే మరో ‘జామ్‌’జాటం చోటు చేసుకుంది. నగరంలోని రహదారుల్లో బేగంపేట–పంజగుట్ట మార్గం అత్యంత కీలకమైంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో పాటు సైబరాబాద్‌లోని ఐటీ సెక్టార్‌కు వెళ్లి వచ్చే వాహనాలతో సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్‌ భారీగా ఉంటుంది.

వారంలో తొలి పనిదినమైన సోమవారం ఈ ఇబ్బందులు మరీ ఎక్కువ. ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్స్‌ వద్ద పనులు జరుగుతుండటంతో మరికొంత ఇబ్బంది కలుగుతోంది. సోమవారం ఓ వ్యక్తి నిర్లక్ష్యం వాహనచోదకుల నరకానికి కారణమైంది. జనప్రియ లేక్‌ ప్రాంతానికి చెందిన దివ్యాన్‌ష కోహిల్‌ సోమవారం ఉదయం బేగంపేట నుంచి పంజగుట్ట వైపు వెళుతుండగా అతడి ఐ–20 కారు బేగంపేట ఫ్లైఓవర్‌పై వరుణ్‌ మోటార్స్‌ వద్ద అదుపు తప్పడంతో సిమెంట్‌ దిమ్మెలతో కూడిన కొలాబ్సబుల్‌ డివైడర్‌ను ఢీ కొట్టింది.


అప్పటికే వేగంగా ఉన్న కారు దిమ్మెలు తప్పుకోవడంతో ఆ మధ్య నుంచి డివైడర్‌ పైకి ఎక్కి ఆగిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు స్పందించి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తుకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఆయన ట్రాఫిక్‌ క్రమబద్దీకరించడానికి ప్రయత్నించారు. ఫ్లైఓవర్‌పై పంజగుట్ట వైపునకు వెళ్లే ట్రాఫిక్‌ ఆగిపోగా... రెండో వైపు నుంచి వెళ్తున్న వాహనచోదకులు కారును చూసేందుకు వెహికిల్స్‌ ఆపుతూ/నెమ్మదిగా పోనివ్వడంతో ఆ వైపు సైతం ట్రాఫిక్‌ ఆగిపోయింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ ట్రాఫిక్‌ క్రేన్‌ను రప్పించి వాహనాన్ని దూరంగా తరలించారు. ఈ విషయమై దివ్యాన్ష్‌ను ప్రశ్నించగా... తనకు ఆ సమయంలో కళ్లు తిరిగాయని, అందుకే కారు అదుపు తప్పిందని చెప్పుకొచ్చాడు.

నిర్లక్ష్యంగా వాహనం నడపటంతో పాటు తీవ్ర ట్రాఫిక్‌ ఇబ్బందులకు కారణమైన అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బేగంపేట ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి తెలిపారు. ‘కారు–డివైడర్‌’ ఘటనతో బేగంపేట మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అటు సికింద్రాబాద్‌... ఇటు పంజగుట్ట రూట్‌లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రధాన రహదారిని విడిచి గల్లీల నుంచి వెళ్లాలని పలువురు భావించడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి వాటిలోనూ ట్రాఫిక్‌ ఆగిపోయింది. కొన్నిచోట్ల శాంతిభద్రతల విభాగానికి చెందిన పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు శ్రమించారు. ఛిద్రమైన రోడ్లు, ఆగిపోయిన ట్రాఫిక్‌ కారణంగా వాహనాల మైలేజ్‌ కూడా ఘోరంగా పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement