ఆశల ‘అడవి’లో గోండ్‌ గొవారీలు!

Thousands of families are worried in the joint Adilabad district - Sakshi

ఆదివాసీలైనా కులం గుర్తింపేదీ లేని దుస్థితి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వేల కుటుంబాల ఆవేదన

గెజిట్‌లో లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వని అధికారులు

విద్య, ఉద్యోగావకాశాలకు దూరం

సంక్షేమ పథకాలూ వర్తించని వైనం

మహారాష్ట్రలో ఎస్టీలుగా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌:  గొవారీ, గోండ్‌ గొవారీ.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతా ల్లోని తెగలివి.. పశువుల కాపరులు.. గోండు రాజుల దగ్గర పనిచేస్తూ అటవీ ప్రాంతాల్లోనే జీవించేవారు.. ఇప్పుడిప్పుడే బయటి ప్రపం చం బాట పట్టారు. కానీ వారికి ‘గుర్తింపు’ సమస్య ఎదురవుతోంది. ప్రభుత్వ గెజిట్‌లోనే ఆ తెగల ప్రస్తావన లేక పోవడంతో అధికారులు వారికి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. సంక్షేమ పథకాలు అం దాలన్నా.. చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తించాలన్నా కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. దీంతో గొవారీలు, గోండ్‌ గొవారీ లు ఏమీ అర్థంకాని దుస్థితిలో పడిపోయారు.

మూడు వేలకుపైగా కుటుంబాలు..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బేల, కౌటాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ మండలాల్లో మహారాష్ట్ర సరిహద్దులకు సమీపంగా గొవారీలు, గోండ్‌ గొవారీ తెగలకు చెందిన మూడు వేలకుపైగా కుటుంబాలున్నాయి. వృత్తిరీత్యా పశువుల కాపరులైనా.. కాలక్రమంలో వ్యవసాయ కూలీలు, ఇతర పనులపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవలికాలంలోనే పిల్లలను బడికి పంపడం మొదలుపెట్టారు. అయితే ప్రాథమికోన్నత స్థాయి వరకు కుల ధ్రువీకరణ పెద్దగా అవసరం లేకున్నా.. పైతరగతుల్లో కుల నమోదుకు ప్రాధాన్యత ఉంటుంది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు కుల ధ్రువీకరణ తప్పనిసరి. దీంతో కుల ధ్రువీకరణ పత్రాల కోసం గొవారీలు, గోండ్‌ గొవారీ ల దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ప్రభు త్వ గెజిట్‌లో ఆ కులాలే లేవంటూ అధికారులు కుల ధ్రువీకరణ పత్రాల జారీకి నిరాకరిస్తున్నారు.

చదువు కష్టం.. ఉద్యోగం రాదు
గొవారీలు, గోండ్‌ గొవారీలు కుల ధ్రువీకరణేదీ లేకపోవడంతో ఓపెన్‌ కేటగిరీ కింద పాఠశాలల్లో చేరుతున్నారు. అలా పదోతరగతి వరకు చదివి ఆపేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దుస్థితిలో ఓపెన్‌ కేటగిరీలో పోటీపడలేక, ఫీజులు చెల్లించి ప్రైవేటు కాలేజీల్లో చదవలేక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఎలాగోలా కష్టపడి చదువుకున్నా అటు ఉద్యోగాలు కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలూ అందని దుస్థితి ఉంది. కల్యాణలక్ష్మి పథకం వర్తించాలన్నా.. సహకార సంస్థల నుంచి రుణాలు, స్వయం ఉపాధి పథకాలు అందాలన్నా కుల ధ్రువీకరణ పత్రం లేక సమస్యలు ఎదురవుతున్నాయి. అసలు ఇప్పటివరకు గొవారీ, గోండ్‌ గొవారీల్లో ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు కేవలం ఒక్కరే కావడం గమనార్హం.

ఇంటర్‌ చదివినా..
‘‘అమ్మ నాన్న ఇద్దరూ వ్యవసాయ కూలీలే. చదువు మీద ఆసక్తితో ఇంటర్‌ చదివిన. కానిస్టేబుల్, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, ఆర్‌ఆర్‌బీ లాంటి నోటిఫికేషన్లు వచ్చినా.. దరఖాస్తు చేద్దామంటే కుల ధ్రువీకరణ పత్రం లేదు. దీంతో కూలికి పోతున్నా’’
– రావుత్‌ కౌడు, బేల మండలం పోనాల

ప్రభుత్వోద్యోగం పొందింది నేనొక్కడినే..
‘‘ఉమ్మడి రాష్ట్రంలో కొంతకాలం గొవారీ, గోండ్‌ గొవారీలకు బీసీ సర్టిఫికెట్లు ఇచ్చారు. అలా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత బీసీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వట్లేదు. మహారాష్ట్రలో మా తెగల వారికి ఎస్టీలుగా గుర్తింపు ఉంది. ఇక్కడ మా గోడు వినేవారే లేరు. ’’   
 – లోహత్‌ జానాజి, విశ్రాంత పోలీసు అధికారి, బేల  

అవకాశం వదులుకున్నా...
‘‘కష్టపడి ప్రైవేటు కాలేజీలో ఫీజు కట్టి ఎంఎల్‌టీ కోర్సు చదివిన. వైద్య శాఖలో పారామెడికల్‌ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. కానీ కుల ధ్రువీకరణ పత్రం లేక దరఖాస్తు చేసుకోలేకపోయిన. అర్హత ఉన్నా లాభం లేక బాధపడ్డా..’’
– దుద్కుర్‌ పూజ, బేల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top