పాతికేళ్లుగా పని చేస్తున్నా.. పదోన్నతి లేకపాయె!

There is no promotions from last 25 years - Sakshi

రాష్ట్రంలో వేలాది మంది కానిస్టేబుళ్ల ఆవేదన 

25 ఏళ్లుగా ఒక్క ప్రమోషన్‌ కూడా దక్కని వైనం

18 ఏళ్లకు కానిస్టేబులైతే రిటైర్మెంట్‌ వరకూ అదే పోస్టు 

హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్‌ఐ పోస్టులు పెంచని పోలీస్‌ శాఖ  

పోస్టుల సమస్య ఉందంటూ దాటవేత 

సుప్రీంకోర్టు సూచనలూ బేఖాతరు.. 

న్యాయం చేయాలంటూ కానిస్టేబుళ్ల మొర 

పోలీస్‌ శాఖకు వాళ్లే బలం, వాళ్లే బలగం. వేలాది మంది నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా విధి నిర్వహణలో నిమగ్నమవుతారు. కాని ఏళ్లు గడుస్తున్నా ఒక్క ప్రమోషన్‌ కూడా లేదు. రాష్ట్రంలోని కానిస్టేబుళ్ల దుస్థితి ఇదీ. ఎస్‌ఐ స్థాయి నుంచి డీజీపీ వరకు ఎవరి కోటా కింద రావాల్సిన ప్రమోషన్‌ వాళ్లకు దక్కుతోంది. మరి కింది స్థాయిలోని వేలాది మంది కానిస్టేబుళ్ల పరిస్థితి మాత్రం ఒక్క ప్రమో షన్‌ కూడా లేకుండా రిటైర్మెంట్‌కు వెళ్లిపోతోంది. దీంతో పోలీస్‌ కానిస్టేబుళ్లు మానసిక వేదనకు గురవుతున్నారు.     
– సాక్షి, హైదరాబాద్‌

కానిస్టేబుల్‌ నుంచి కానిస్టేబుల్‌గానే. .
రాష్ట్ర రాజధానిలో పని చేసే పవన్‌ (పేరు మార్చాం) 1991లో కానిస్టేబుల్‌గా సెలక్ట్‌ అయ్యాడు. అప్పుడు అతడి వయసు 18 సంవత్సరాలు. సర్వీసులో చేరి 27 ఏళ్లు గడుస్తోంది. పవన్‌ ఇప్పుడు కూడా కానిస్టేబుల్‌గానే ఉన్నాడు. అదే 1991లో ఎస్‌ఐగా చేరిన అతడి స్నేహితుడు మహేశ్‌ (పేరు మార్చాం) ప్రస్తుతం డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడికి రెండు ప్రమోషన్లు వచ్చాయి. పవన్‌ చేసిన సర్వీస్, అతడి స్నేహితుడు మహేశ్‌ చేసిన సర్వీసు రెండూ ఒకటే. కాని ఇద్దరి ప్రమోషన్లలో తేడా. ఇలా పవన్‌ ఒక్కడే కాదు యావత్‌ తెలంగాణ పోలీస్‌ శాఖలో 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వేలాది మంది కానిస్టేబుళ్లు కనీసం హెడ్‌కానిస్టేబుల్‌గా కూడా పదోన్నతి పొందుకుండానే పదవీ విరమణ పొందుతున్నారు. 

పదోన్నతికి పోస్టుల సమస్య.. 
పోలీస్‌ శాఖలో కానిస్టేబుళ్లే కీలకం. అయితే వేల సంఖ్యలో ఉన్న కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి ఇచ్చేందుకు పోస్టుల సమస్య ఉందని పోలీస్‌ శాఖ చెబుతోంది. ఎస్‌ఐ నుంచి ఇన్‌స్పెక్టర్‌ ప్రమోషన్ల కోసం సూపర్‌ న్యూమరరీ పోస్టులను పెంచారు. డీఎస్పీ, అదనపు ఎస్పీ అడహక్‌ పదోన్నతుల పేరిట వందలాది మంది అధికారులకు పదోన్నతులిచ్చారు. మరి కిందిస్థాయిలోని కానిస్టేబుళ్ల విషయంలో ఇలాంటి కొత్త పోస్టుల సృష్టి, లేదా సూపర్‌ న్యూమరరీ పోస్టులు పెంచడానికి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న అంశంపై ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. 

ఏడాది నుంచి శిక్షణ వాయిదా 
ప్రస్తుతం హెడ్‌కానిస్టేబుల్‌ పదోన్నతికి అర్హత సాధించి ట్రైనింగ్‌కు వెళ్లేందుకు 4 వేల మంది కానిస్టేబుళ్లు సిద్ధంగా ఉన్నారు. వీరికి శిక్షణ ఇచ్చి పోస్టింగ్స్‌ ఇచ్చేలోపు అందులో 285 మంది పదవీ విరమణ పొందే జాబితాలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఏడాది నుంచి వీరి శిక్షణ వాయిదా పడుతూ వస్తోంది. అసలే పదోన్నతి రాదు, వచ్చినా శిక్షణకు పంపకుండా ఏళ్ల తరబడి వాయిదా వేసి మానసిక వేదనకు గురి చేస్తున్నారని కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆరేళ్లకోసారి పదోన్నతి ఇవ్వాల్సిందే! 
ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల వ్యవహారంలో సుప్రీంకోర్టు గతంలో పలు కీలకమైన సూచనలు చేసింది. పోలీస్‌ శాఖలో ప్రతీ ఆరేళ్లకోసారి పదోన్నతి కల్పించాలని స్పష్టంచేసింది. ఆరేళ్లు కానిస్టేబుల్‌గా పని చేస్తే హెడ్‌కానిస్టేబుల్‌గా, హెడ్‌ కానిస్టేబుల్‌గా ఆరేళ్లు సర్వీస్‌ పూర్తి చేస్తే ఏఎస్‌ఐగా పదోన్నతి కల్పించాలని ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులు అమలు చేసే అధికారులే వాటిని అటకెక్కించారు. అదేంటని అడిగితే వేల మందికి పదోన్నతులివ్వడం కుదరదని, పోస్టులు లేవని సమాధానం చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. లేకుంటే పదోన్నతి ఇవ్వకుండా ఇంక్రిమెంట్లు ఇచ్చి వదిలేస్తున్నారు. 

కొత్త జిల్లాల్లో పోస్టుల సంగతేంటి? 
జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త పోస్టులు ఏర్పాటు చేస్తూ జీవో నంబర్‌ 121ను ప్రభుత్వం జారీ చేసి ఏడాది గడిచింది. ఆ ప్రకారం ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను భర్తీ చేయడంలోనూ పోలీస్‌ శాఖ అలసత్వం చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంట్రల్‌ ఫోర్స్‌ విధానంలో భాగంగా పదోన్నతికి అర్హత సాధించిన ప్యానల్‌ ఏడాది రాగానే.. పదోన్నతి కోసం సిబ్బందికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి పదోన్నతులు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీ విషయంలో 30 శాతం కోటా కానిస్టేబుల్‌ ర్యాంకర్లది. కాని ఈ కోటాను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు పోస్టుల పెంపుతోపాటు అర్హత సాధించిన వారిని ట్రైనింగ్‌ పంపించాలని కానిస్టేబుళ్లు వేడుకుంటున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top