అప్పుడు బాధ.. ఇప్పుడు సంతోషం

Then sorrow .. Now happy - Sakshi

గతంలో కందనూలు ఎడారిలా ఉండేవి..

మేం అధికారంలోకి వచ్చాక జిల్లా చేశాం.. నీళ్లు తీసుకొచ్చాం

నాగర్‌కర్నూల్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌  

రాష్ట్రం సాధించకపోతే జిందగీలో జిల్లా ప్రకటన రాకపోయేది 

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : ‘గతంలో నాగర్‌కర్నూల్‌కు వస్తే ఎడారిలా ఉన్న పరిస్థితులను చూసి బాధకలిగేది. ఇప్పుడు కాల్వల్లో పారుతున్న నీళ్లను చూసి చాలా సంతోషం కలుగుతోంది’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ మండలంలోని ఉయ్యలవాడ గ్రామ శివారులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రజలు గాలిగాలి, గత్తర గత్తరగా ఓటేస్తే పరిపాలన కూడా అదేవిధంగా ఉంటుంది. ఓటు వేసేముందు జాగ్రత్త వహించాలని కోరారు. నిరంతరం 24గంటల విద్యుత్‌ ఇవ్వాలంటే మామూలుగా సాధ్యంకాదని, కాపలా కుక్కలా పనిచేస్తేనే అలా సాధ్యమవుతోందని అన్నారు. గత పాలకులు 24గంటల కరెంట్‌ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వలేకపోయారని అన్నారు.

తెలంగాణలో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కంటివెలుగు ద్వారా మీ ఊరికే వచ్చి వైద్యబృందాలు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. రానురాను గొంతు, చెవి, ముక్కు డాక్టర్లు కూడా వస్తారని, వారి తర్వాత పథాలజికల్‌ బృందం కూడా మీ గ్రామాలను సందర్శించి పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడామని, అదేస్థాయిలో పరిపాలన కూడా కొనసాగిస్తున్నామని చెప్పారు.  

నిదానమైనా తప్పకుండా ఇస్తాం..  
డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిదానంగా ఇచ్చినా పకడ్బందీగా ఇస్తామని, రెండు తరాలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఉంటాయని అన్నారు. ఎవరికైనా స్థలం ఉంటే రూ.5లక్షలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో రూ.5లక్షలు రుణం ఇస్తామని చెప్పిందని, కానీ తాము ఉచితంగా ఇస్తామని అన్నారు.

డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కూడా గొర్రెల పథకం లాగే లాటరీ ద్వారా పారదర్శకంగా చేపడతామని చెప్పారు. నిజాయితీగా పనిచేస్తూ కడుపు కట్టుకుని రాష్ట్ర సంపదను పెంచుతున్నామని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ పథకాన్ని 11రాష్ట్రాల వారు వచ్చి చూశారని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఇంటింటికి తాగునీరు అందజేయడం జరుగుతుందని అన్నారు.

తెలంగాణ రాకపోతే నాగర్‌కర్నూల్‌ కూడా జిందగీలో జిల్లా కాకపోయేదని, ఇచ్చిన హామీ ప్రకారం నాగర్‌కర్నూల్‌ను జిల్లా చేశానని వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌కు మర్రి జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యాకే కేఎల్‌ఐ ద్వారా 75వేల ఎకరాలకు నీరందుతోందని, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఇక బంగారు కందనూలే అవుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నరలో వట్టెం రిజర్వాయర్‌ పూర్తిచేసి సాగునీరు అందిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.  

మర్రి వినతులకు ఓకే 
కేసీఆర్‌ ప్రసంగానికి ముందు ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడారు. గతంలో ఇచ్చిన పలు హామీలు నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పలు అభ్యర్థనలను కేసీఆర్‌ ముందు ఉంచారు. దీనిపై స్పందించిన కేసీఆర్, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే నాగర్‌కర్నూల్‌కు మెడికల్‌ కళాశాలతోపాటు ఇంజనీరింగ్‌ కళాశాల కూడా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అలాగే బిజినేపల్లి మండలంలో సాగునీరు అందకుండా ఉన్న 18 తండాలు, గ్రామాలకు సంబంధించి మార్కండేయ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మిస్తామని, దీనికి తానే శంకుస్థాపన చేసి ఐదారు గంటలు అక్కడే ఉండి ప్రజలతో గడుపుతానని తెలిపారు. నాగర్‌కర్నూల్‌ను జిల్లా చేసి ప్రజలకు కానుక ఇచ్చిన తనకు ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీని కానుక ఇవ్వాలని కోరారు.

ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేయాలని అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు ఆ స్థాయిలోనే నిధులు తేవడంతోపాటు అభివృద్ధి పనులు కూడా జరిగాయని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పి.రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథం, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బైకని శ్రీనివాస్‌యాదవ్, జక్కా రఘునందన్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ వెంకటయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ వంగా మోహన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. 

ప్రజలే నిర్ణయించాలి  
నాలుగున్నరేళ్ల తన పనితీరుపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ధర్మం, అధర్మం మధ్య జరుగుతున్న ఈ పోరులో ప్రజలు ధర్మంవైపు నిలబడాలి. స్థానికంగా ఉన్న నాయకులకు 40ఏళ్లలో రానిపేరు నాలుగేళ్లలో తనకు వస్తుందనే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. 275 కిలోమీటర్లు కేఎల్‌ఐ కాల్వగుండా పాదయాత్ర చేసి నీళ్లు రాని గ్రామాలను గుర్తించి సమస్యలను పరిష్కరించాం. నాగం, రేవంత్‌రెడ్డి ఒకే తాను ముక్కలు. మిమ్మల్ని మోసే నాయకుడు కావాలో, గెలిచిన తర్వాత మీరు మోసే నాయకుడు కావాలో తేల్చుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళ్లుమొక్కి జిల్లా ప్రకటన చేయించా. ఈనెల 7న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలి.              – మర్రి జనార్దన్‌రెడ్డి   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top