ఒక్కమార్కుతో ఫెయిల్‌ జీవితంలో పాస్‌..

Tenth Fail Student Life Story Karimnagar - Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పెద్దచదువులు అబ్బలేదు.. అయితేనేం జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగాడు.. పదో తరగతిలో ఫెయిలైనా కలత చెందలేదు.. పట్టుదలతో ఏదైనా సాధించాలని కంకణం కట్టుకున్నాడు.. అంతే.. పొట్టచేత పట్టుకుని పరాయి దేశం వెళ్లాడు.. అక్కడే కూలీ పనులు చేస్తూ ఉన్నతంగా ఎదిగాడు. ఇప్పుడు పెద్దకంపెనీలు స్థాపించి వందలాది మందికి ఉపాధికల్పిస్తున్నాడు.. ఆయనే  ఎల్లారెడ్డిపేటకు చెందిన రాధారపు సత్యం. ఆయన విజయం వెనుక రహస్యాలు.. ఆయన మాటల్లోనే..

వెయ్యి మందికి ఉపాధి..
వీర్నపల్లిలో 1995–96 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన. గణితంలో ఒకేఒక్క మార్కు తక్కువ రావడంతో ఫెయిలైన. రెండేళ్లు ఖాళీగా ఉన్న. మా సోదరుడు శంకర్‌ సాయంతో 1998లో కంపెనీ వీసాపై దుబాయి పోయిన. అక్కడే కూలీ పనులు చేసిన. ఎల్‌ఎస్‌పీఎంకే పేరిట దుబాయిలో భవన నిర్మాణాల కంపెనీ ప్రారంభించిన. సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్న.

పుట్టెడు కష్టాలు..
నా చిన్నతనంలోనే అమ్మానాన్న అనారోగ్యంతో చనిపోయిండ్రు. సోదరుడు, ఒక అక్క, చెల్లెలు. అన్నీ తామై నన్ను పెంచిండ్రు. ఆర్థిక పరిస్థితులకు తోడు పదో తరగతిలో ఫెయిలైన. సోదరుని సాయంతో దుబాయికి వెళ్లి కూలీ పనులకు కుదిరిన. కొన్నాళ్లపాటు అవేపనులు చేసిన. కొందరు మిత్రుల సాయంతో దుబాయిలోనే భవన నిర్మాణ వ్యాపారం ప్రారంభించిన. ప్రస్తుతం దుబాయి  ఎమిరేట్స్‌ తెలంగాణ సాంస్కృతిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న.

వెయ్యి కుటుంబాల్లో వెలుగులు నింపాలి..
భవన నిర్మాణ రంగ వ్యాపారం అనుకూలించింది. కూలీల అవసరం ఎక్కువైంది. అందుకే.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మందిని నా కంపెనీలో కూలీలుగా పెట్టుకున్న. నేను బతకడం కష్టమనుకునే పరిస్థితిని ఇలా అధిగమించిన. అంచలంచెలుగా ఎదగడమే కాదు.. నేను ఉపాధి కల్పిస్తున్న వెయ్యి కుటుంబాల్లో వెలుగులు నింపాననే సంతృప్తి నా జీవితకాలం ఉంటుందని నా అభిప్రాయం.

నిరుపేదలకు అండగా..
అనాథలకు అండగా ఉంటూ.. నిరుపేదలకు ఆకలి తీర్చడమే లక్ష్యంగా ముందుకు పోతున్న. అభాగ్యులకు ఆపద సమయంలో నేనున్నాననే భరోసా కల్పిస్తున్న. వృద్ధాశ్రమంలో మలిసంధ్యలో ఉన్న అవ్వలకు బువ్వకోసం సాయం చేస్తున్న. తంగళపల్లిలోని లగిశెట్టి శ్రీనివాస్‌ చారిట్రబుల్‌ ట్రస్ట్‌లోని అనాథలకు రూ.50వేలు, గంభీరావుపేట వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుస్తులు, పండ్లు, రూ.25వేల నగదు అందించిన. ఎల్లారెడ్డిపేటలోని 20 మంది అనాథ మహిళలకు దుప్పట్లు, దుస్తులు అందించిన. వివిధ సందర్భాల్లో వివాహం చేయలేని స్థితిలో ఉన్న నిరుపేద తల్లిదండ్రుల కూతుళ్ల పెళ్లిళ్లకు పుస్తెమెట్టెలు, దుస్తులు, పెళ్లి సామగ్రి అందిస్తూ వస్తున్న. ఇలా ఇప్పటివరకు 25 మంది యువతుల వివాహాలకు రూ.2.25 లక్షల సాయం చేసిన. పాఠశాలల్లో విద్యార్థుల చదువులకోసం రూ.5 లక్షలతో పది పాఠశాలలకు ప్రొజెక్టర్లు, దుస్తులు, విద్యాసామగ్రి అందించిన.

జీవితకాలం కొనసాగిస్తా
నేను ఒకప్పుడు బుక్కెడు బువ్వకోసం తండ్లాడిన. ఆకలి బాధ అంటే నాకు తెలుసు. అందుకే పేదల ఆకలి తీర్చడంలో ముందుంటున్న. పెద్ద చదువులు చదువలేకపోయినా.. తెలివితో రాణించి పదిమందికి సాయం చేసే విధంగా నేటి యువత ఎదగాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top